Telugu Global
National

బుల్లెట్స్ ఇలా లోడ్ చేయాలా? యూపీ పోలీసులు సినిమాలు చూడట్లేదా!

పోలీసులకు కనీసం గన్ లోడ్ చేయడం రాకపోవడం చాలా తీవ్రమైన విషయం అని డీఐజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుల్లెట్స్ ఇలా లోడ్ చేయాలా? యూపీ పోలీసులు సినిమాలు చూడట్లేదా!
X

గన్ ఎలా పేల్చాలి.. బుల్లెట్లు ఎలా నింపాలనే విషయాలను ఇప్పుడు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేస్తున్నాడు. ఓ సినిమాలో మహేష్ బాబుకు విలన్ గన్ ఇస్తే.. ఎంతో అనుభవం ఉన్న వాడిలా తిప్పుతాడు. ఎలా తెలుసు అని అడిగితే.. సినిమాలు చూడట్లేదా అని సమాధానం ఇస్తాడు. సరే సామాన్యులు సినిమాలు, యూట్యూబ్‌లు చూసి తెలుసుకుంటారు. వారికి అవసరం కూడా ఉండదు. కానీ పోలీసులకు అయినా గన్ ఎలా వాడాలో తెలుసుండాలి కదా. కనీసం బుల్లెట్లు ఎలా లోడ్ చేస్తారనే కనీస జ్ఞానం ఉండాలి కదా? కానీ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను చూస్తే వీళ్లసలు పోలీసులేనా అనే డౌట్ రావడం ఖాయం. వాళ్ల పని తీరు స్వయంగా చూసిన డీజీపీకి ఏం చేయాలో అర్థం కాలేదు.

యూపీ డీజీపీ ఆర్కే భరద్వాజ్ సంత్ కబీర్ నగర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐని పిలిచి గన్‌లో బుల్లెట్స్ లోడ్ చేయమని అన్నారు. ఆ ఎస్ఐ గన్ తీసుకొని బ్యారెల్ ముందు భాగం నుంచి పిల్లలు బుల్లెట్లు పంపినట్లు పంపించాడు.

ఇప్పుడు అన్‌లోడ్ చేయమని అడగగా.. ఇదిగో అంటూ దాన్ని ఉల్టా తిప్పి బల్లెట్లు డీఐజీ చేతిలో పెట్టాడు. ఆ ఎస్ఐ పని తీరు చూసి డీఐజీ అవాక్కయ్యారు. ఆ వెనుకే ఉన్న మరో అధికారి తలపై కట్టుకోవడం కనిపించింది. ఎస్ఐ స్థాయి వ్యక్తికి కనీసం గన్ లోడ్ చేయడం రాకపోవడం ఏంటని అక్కడే మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులకు కనీసం గన్ లోడ్ చేయడం రాకపోవడం చాలా తీవ్రమైన విషయం అని డీఐజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు అందరికీ మరోసారి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు సాధన చేయించాలని చెప్పారు. తుపాకీ పేల్చడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చి రిపోర్టును వెంటనే తనకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకటే సెటైర్లు వేస్తున్నారు.

ఇలాంటి పోలీసులు దొంగలను ఎలా పట్టుకుంటారని అంటున్నారు. యోగీ ఆధిత్యానాథ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. యోగీ హయాంలో పోలీసులకు కనీసం తుపాకీ పేల్చడం కూడా రాదు. తుపాకీ ముందు భాగం నుంచి బుల్లెట్స్ లోడ్ చేస్తున్న ఏకైక పోలీసులు వీళ్లే అని మండిపడ్డారు. ఇది అజ్ఞానానికి పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు.



First Published:  28 Dec 2022 12:55 PM GMT
Next Story