Telugu Global
National

పెట్రోల్, డీజిల్ బాదుడే బాదుడు.. ఏడాదిలో ఎన్నిరోజులంటే..

గడిచిన ఏడాది అంటే 365 రోజుల్లో కేంద్రం 78 సార్లు పెట్రోల్ సెస్, 76 సార్లు డీజిల్ సెస్ పెంచింది. అంటే రెండూ కలిపితే దాదాపు రోజుమార్చి రోజు ఆయిల్ ధరలు సవరించినట్టు లెక్క. ఏడాదిలో ఏడుసార్లు పెట్రోల్ సెస్, 10సార్లు డీజిల్ సెస్ తగ్గించింది.

పెట్రోల్, డీజిల్ బాదుడే బాదుడు.. ఏడాదిలో ఎన్నిరోజులంటే..
X

పార్లమెంట్ లో మంత్రులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విపక్ష ఎంపీలు అడిగిన, అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి వారంతా తడబడుతున్నారు. అధికారిక లెక్కలు చెప్పి ప్రభుత్వం పరువు తీయడం ఇష్టం లేకపోయినా ఆ లెక్కలు బయటపెట్టక తప్పని పరిస్థితి. అప్పటికీ లిఖిత పూర్వక సమాధానాలిస్తూ పార్లమెంట్ లో ప్రతిపక్షాల విమర్శలను కాచుకుంటున్నా.. ఆ తర్వాత సోషల్ మీడియాకి బలైపోతున్నారు. తాజాగా పెట్రోల్‌, డీజిల్ రేట్లను ఏడాదిలో ఎన్నిసార్లు పెంచారన్న ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ తేలి ఇలా సమాధానమిచ్చారు.

గడిచిన ఏడాది అంటే 365 రోజుల్లో కేంద్రం 78 సార్లు పెట్రోల్ సెస్, 76 సార్లు డీజిల్ సెస్ పెంచింది. అంటే రెండూ కలిపితే దాదాపు రోజుమార్చి రోజు ఆయిల్ ధరలు సవరించినట్టు లెక్క. ఏడాదిలో ఏడుసార్లు పెట్రోల్ సెస్, 10సార్లు డీజిల్ సెస్ తగ్గించింది. అది కూడా నామమాత్రమేననేది అందరికీ తెలిసిందే. అంటే పెట్రోల్ విషయంలో కేంద్రం 78సార్లు వాతలు పెట్టి కేవలం ఏడుసార్లు మాత్రమే బర్నాల్ పూసిందనమాట. ఇక పెట్రోల్ విషయంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కేవలం 280 మాత్రమే. అంటే ఏడాదిలో పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉన్న రోజులవి. డీజిల్ రేట్లు 279 రోజులపాటు స్థిరంగా ఉన్నాయి. మిగతా రోజులన్నీ వాహనదారులకు పీడకలలుగా మారాయి.

గతంలో ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి గరిష్టంగా నాలుగైదు సార్లు ఇంధన ధరలు సవరించేది. కనీసం నెలకోసారి రేట్లు పెరిగాయని అనుకున్నా 12సార్లు పెరగాలి అంతే. కానీ వారానికి ఒకటికంటే ఎక్కువసార్లు భారత్ లో పెట్రోల్ రేట్లు పెరగడం మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి. పార్లమెంట్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి ఇలా సవివరంగా సమాధానమిచ్చారు.

First Published:  25 July 2022 4:06 PM GMT
Next Story