Telugu Global
National

స్వపక్షంలో విపక్షం.. రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ వ్యాఖ్యల కలకలం..

సొంత పార్టీపై సెల్ఫ్ కౌంటర్ల డోసు బాగా పెంచారు గడ్కరీ. వాడుకుని వదిలేసేవాళ్లు చాలా మందే ఉంటారని ఇటీవలే ఓ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. తాజాగా సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంపై కూడా తనదైన శైలిలో స్పందించారు.

స్వపక్షంలో విపక్షం.. రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ వ్యాఖ్యల కలకలం..
X

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సొంత పార్టీకే చురుకు పుట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా తయారైన గడ్కరీని ఆ మధ్య బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా ఆయన స్వరం ఏ మాత్రం మారలేదు, సరికదా ఇటీవల సొంత పార్టీపై సెల్ఫ్ కౌంటర్ల డోసు బాగా పెంచారు గడ్కరీ. వాడుకుని వదిలేసేవాళ్లు చాలా మందే ఉంటారని ఇటీవలే ఓ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. తాజాగా సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంపై కూడా తనదైన శైలిలో స్పందించారు.

కాంట్రాక్ట్ సంస్థలదే తప్పంతా..

హైవేల నిర్మాణంలో చాలా చోట్ల నాణ్యత ఉండటం లేదని, కాంట్రాక్ట్ సంస్థలే దీనికి బాధ్యత వహించాలన్నారు గడ్కరీ. అంటే ఆయన కాంట్రాక్ట్ సంస్థలకు అనుమతులిచ్చే కేంద్ర ప్రభుత్వాన్నే పరోక్షంగా టార్గెట్ చేశారు. కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటేనే, కాంట్రాక్ట్ సంస్థలు తప్పులు చేసే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు గడ్కరీ. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని ఆరోపించారు. డీపీఆర్‌లు సమర్పించే సమయంలోనే తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా కంపెనీలకు సరైన శిక్షణ ఇవ్వాలని అన్నారు.

శిక్షణ లేని డ్రైవర్లు..

కారు బెంజ్ అయినా.. డ్రైవర్‌కి శిక్షణ లేకపోతే ప్రమాదాలు తప్పవన్నారు గడ్కరీ. రోడ్డు ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరగడం కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారాయన. దీనికి సైతం కారణాలను గుర్తించాలని చెప్పారు. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు మరోసారి కేంద్రం తప్పుని ఎత్తి చూపేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు వివరించిన గడ్కరీ, అందులో కేంద్రం నిర్లక్ష్యాన్ని కూడా బయటపెట్టారు. ప్రాజెక్ట్‌ల‌ నిర్మాణంలో ఆలస్యం, ప్రాజెక్ట్‌ల‌ డీపీఆర్ సరిగా లేకపోవడం, రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేమి.. ఇవన్నీ ప్రమాదాలకు కారణం అంటున్నారు. దేశంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్‌ల‌ ఆలస్యానికి నిధుల విడుదల ఆలస్యం కావడమేనని గతంలో కూడా ఓసారి బాంబు పేల్చారు గడ్కరీ. మరోసారి ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.

First Published:  6 Sep 2022 4:37 AM GMT
Next Story