Telugu Global
National

రూపాయి వీక్.. నిర్మలమ్మ వ్యాఖ్యలు ఇంకా వీక్..

కేవలం తగ్గుదలతోనే నేలచూపులు చూస్తున్న రూపాయి విషయంలో హెచ్చుతగ్గులు లేవంటూ బుకాయించడం నిర్మలమ్మకే చెల్లింది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఫారెక్స్‌ నిల్వలు విక్రయించడానికి కూడా సిద్ధమైంది.

రూపాయి వీక్.. నిర్మలమ్మ వ్యాఖ్యలు ఇంకా వీక్..
X

ప్రతిపక్షంలో ఉండగా రూపాయి విలువ పతనంపై గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు ఇప్పుడు తమ హయాంలో రూపాయి పతనాన్ని మాత్రం కవర్ చేసుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారు. మంచి జరిగితే అది తమ గొప్పతనం, చెడు జరిగితే అది ప్రకృతి విపత్తు అనడం బీజేపీకి బాగా అలవాటు. ఇప్పుడు రూపాయి పతనాన్ని కూడా అంతర్జాతీయ పరిణామంగా చెప్పుకోవాల్సిన దుస్థితి కేంద్రానికి వచ్చింది. తాజాగా డాలర్ తో రూపాయి మారక విలువ జీవిత కాల కనిష్టానికి చేరుకోవడాన్ని సహజ పరిణామంగా చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు నిస్సిగ్గుగా ఇతర దేశ కరెన్సీలతో పోలిక తెస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రూపాయి పతనాన్ని తనదైన శైలిలో విశ్లేషించి పరువు పోగొట్టుకుంటున్నారు.

రూపాయి రాణిస్తోందట..

రూపాయి పతనంపై నిర్మలా సీతారామన్‌ తనదైన శైలిలో స్పందించారు. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి బాగానే రాణిస్తోందని అంటున్నారామె. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారామె. ఇతర కరెన్సీల్లా తీవ్రమైన ఒడుదొడుకులకు రూపాయి గురికాలేదని బుకాయిస్తున్నారు. తీవ్రమైన హెచ్చుతగ్గులకు రూపాయి లోను కాలేదంటున్నారు. ప్రపంచ మార్కెట్లో హెచ్చుతగ్గులకు గురికాకుండా స్థిరంగా ఉన్నది రూపాయేనని చెబుతున్నారామె.

పతనానికి పరాకాష్ట..

రూపాయి పతనంపై ఇటీవలే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జీవిత కాల కనిష్టానికి రూపాయి విలువ చేరుకోవడంతో ద్రవ్యోల్బణం పెరిగి వస్తువుల ధరలు పెరగడాన్ని సామాన్యుడు కూడా అనుభవిస్తున్నాడు. మరి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ఎలా కవర్ చేయాలనుకుంటున్నారో అర్థం కావడంలేదు. కేవలం తగ్గుదలతోనే నేలచూపులు చూస్తున్న రూపాయి విషయంలో హెచ్చుతగ్గులు లేవంటూ బుకాయించడం ఆమెకే చెల్లింది. అటు రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఫారెక్స్‌ నిల్వలు విక్రయించడానికి కూడా సిద్ధమైంది. ఈ దశలో నిర్మలమ్మ వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

First Published:  25 Sep 2022 1:52 AM GMT
Next Story