Telugu Global
National

యూజ్ అండ్ త్రో పాలిటిక్స్.. గడ్కరీ టార్గెట్ మోదీయేనా..?

అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్‌ అండ్‌ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని అన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.

యూజ్ అండ్ త్రో పాలిటిక్స్.. గడ్కరీ టార్గెట్ మోదీయేనా..?
X

బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ నుంచి గడ్కరీని తొలగించిన తర్వాత ఆయన పరోక్షంగా మాట్లాడిన ప్రతి మాటా మోదీ, అమిత్ షా లకు చురకలంటించేలా ఉంటోంది. తాజాగా ఆయన యూజ్ అండ్ త్రో అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా మోదీ, షానే టార్గెట్ చేస్తున్నాయని అంటున్నారు. అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్‌ అండ్‌ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని అన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. వ్యాపారంలో అయినా రాజకీయాల్లో అయినా మానవ సంబంధాలే అతిపెద్ద బలమని, వాటిని పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో గడ్కరీ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి.

ఓటమితో ఓ మనిషి శకం ముగిసినట్టు కాదని, అతను బాధ్యతల నుంచి తప్పుకునప్పుడే అతని ముగింపు మొదలైనట్టు అని అన్నారు గడ్కరీ. మంచి రోజులైనా, చెడ్డ రోజులైనా.. ఒకసారి ఎవరి చేతినైనా పట్టుకుంటే, దాన్ని ఎప్పటికీ వదలకూడదని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆత్మకథలో చెప్పిన మాటల్ని కూడా ప్రస్తావించారు గడ్కరీ. అంటే తన శకం ఇంకా ముగిసిపోలేదని ఆయన పరోక్షంగా చెప్పారా..? మోదీ-అమిత్ షా లపై సెటైర్లు వేశారా అనేది తేలాల్సి ఉంది.

గతంలో కూడా గడ్కరీ మాటలు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయంటూ ఆమధ్య ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు అంటే అధికారం కోసం వెంపర్లాడటంలా తయారైందని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కారు సకాలంలో స్పందించడంలేదని, సమస్యలకు అదే మూలకారణం అని కూడా మరో సందర్భంలో అన్నారు. నాటి బీజేపీ నాయకుల కృషివల్లే నేడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉందంటూ.. ఇటీవల గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ అంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఇవి నేరుగా మోదీ-షా ద్వయాన్ని టార్గెట్ చేస్తూ అన్న మాటలేనని తేలిపోయిందని, ఇక గడ్కరీ వాయిస్ మున్ముందు రోజుల్లో మరింత పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.

First Published:  29 Aug 2022 3:16 AM GMT
Next Story