Telugu Global
National

ఆర్వీఎంలపై కేంద్రం వెనక్కి తగ్గినట్టేనా..?

సొంత ఊరిలో ఓటు హక్కు ఉండి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఆ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికోసమే రిమోట్ ఓటింగ్ మిషన్లను తీసుకు రావాలని చూస్తోంది కేంద్రం.

ఆర్వీఎంలపై కేంద్రం వెనక్కి తగ్గినట్టేనా..?
X

ఈవీఎంలతోపాటు ఆర్వీఎంలను కూడా తెరపైకి తేవాలని చూస్తున్న కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టే తెలుస్తోంది. ఆర్వీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంది కేంద్రం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిమోట్‌ ఓటింగ్‌ యంత్రాలను (RVM) ఉపయోగించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎంపీలు లోక్‌ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో RVMలను పరిచయం చేసే ఆలోచన లేదన్నారు. RVMలు ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల కోసం మాత్రమే ఉపయోగిస్తారనేది కూడా వాస్తవం కాదని చెప్పారు. ఎన్నికల సంఘానికి సైతం ఈ విషయాన్ని తెలియజేశామని స్పష్టం చేశారాయన.

సొంత ఊరిలో ఓటు హక్కు ఉండి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఆ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికోసమే రిమోట్ ఓటింగ్ మిషన్లను తీసుకు రావాలని చూస్తోంది కేంద్రం.ECIL సంస్థ ఈ RVMలను అభివృద్ధి చేసింది కూడా. అన్ని పార్టీలకు దీనిపై డెమో ఇచ్చింది కానీ ప్రతిపక్షాలు ముక్తకంఠంతో RVMలు వద్దని తేల్చేశాయి. అసలు ఈవీఎంలలోని లోటుపాట్లపైనే ఇంకా క్లారిటీ రాలేదని, ఇప్పుడీ RVMలతో గందరగోళం దేనికని ప్రశ్నించాయి. వీటి పనితీరు పరిశీలించేందుకు కూడా పార్టీలు విముఖత ప్రదర్శించాయి. దీంతో ఈసీ ఏర్పాటు చేసిన ఆ డెమో కార్యక్రమం విజయవంతం కాలేదు.

ఆర్వీఎంలతో వలస కార్మికులు ఓట్లు వేస్తారు కానీ.. వారి గుర్తింపుని పరిశీలించే తగిన యంత్రాంగం అందుబాటులో ఉండకపోవచ్చు. ఈవీఎంలను భద్రపరిచే విషయంలోనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్వీఎంలు వినియోగంలోకి వస్తే వాటి రవాణా, భద్రత కూడా ప్రశ్నార్థకం అవుతాయి. అందులోనూ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఇంకో రాష్ట్రంలో ఆర్వీఎంల మూలాన ఎన్నికల నిబంధనలు అమలులోకి తేవాల్సి ఉంటుంది. వీటి వినియోగంపై ప్రతిపక్ష పార్టీలు మరిన్ని సందేహాలు బయటపెట్టాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈసారికి ఆర్వీఎంలను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించట్లేదని తేల్చి చెప్పింది.

First Published:  3 Feb 2023 2:52 PM GMT
Next Story