Telugu Global
National

మోడీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉందా? జూలై 3న కీలక మంత్రివర్గ సమావేశం

బీజేపీ అగ్రనేతల సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

మోడీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉందా? జూలై 3న కీలక మంత్రివర్గ సమావేశం
X

ప్రధాని నరేంద్ర మోడీ జూలై 3న కీలక కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో ఈ భేటీ జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ.. బుధవారం రాత్రి ఆకస్మికంగా బీజేపీ సీనియర్ నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. త్వరలో తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో పాటు.. కొన్ని రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టులు, నిధులు ప్రకటించే విషయంపై చర్చించినట్లు తెలుస్తున్నది.

బీజేపీ అగ్రనేతల సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న కొంత మంది మంత్రులను తొలగించి.. కొత్తగా మరి కొంత మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నది. మరో వైపు జూలై 3వ వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన కార్యచరణపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తున్నది.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించారు. అయా రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించి.. పలు విషయాలు తెలుసుకున్నారు. ఆ నివేదికల ప్రకారం రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేసి.. కొత్త మంత్రులనుతీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  29 Jun 2023 12:40 PM GMT
Next Story