Telugu Global
National

మోడీ పాలనలో భారీగా పెరిగిన నిరుద్యోగం.. మందగించిన ఆర్థిక కార్యకలాపాలు

కరోనా సంక్షోభానికి ముందు 202 జనవరి నాటికి దేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 41.1 కోట్లు ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 40.9 కోట్లకు తగ్గింది.

మోడీ పాలనలో భారీగా పెరిగిన నిరుద్యోగం.. మందగించిన ఆర్థిక కార్యకలాపాలు
X

ప్రధాని మోడీ, బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే ప్రకారం.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉండగా.. అర్బన్ ఏరియాల్లో 8 నుంచి 10 శాతంగా ఉన్నది. గత 41 నెలల్లో నిరుద్యోగిత రేటులో ఎలాంటి తగ్గుదల కనిపించలేదని సదరు సర్వేలో వెల్లడైంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ హామీనే మర్చిపోయింది.

కరోనా సంక్షోభానికి ముందు 202 జనవరి నాటికి దేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 41.1 కోట్లు ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 40.9 కోట్లకు తగ్గింది. కార్మిక భాగస్వామ్య రేటు 42.9 నుంచి 39.8 శాతానికి పడిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సైతం 33 శాతం ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.89,400 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఖర్చు కాగా.. ఈ సారి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించింది.

విదేశీ యంత్రాల దిగుమతులకు కేంద్రం ఎక్కువగా మొగ్గు చూపడంతో స్థానిక ఉద్యోగాల కల్పన, దేశీయ తయారీ రంగాల దెబ్బతింటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. బీజేపీ పాలనలో కార్పొరేట్ రంగానికి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, క్రెడిట్ ఫెసిలిటీని పెంచడం వంటి చర్యల కారణంగా ఉద్యోగాలు పెరగడం లేదని తెలుస్తోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లలో లిస్టెడ్ కంపెనీలు భారీగా లాభాలు అర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక దేశంలో నిరుద్యోగం పెరగడం, ఆదాయ లేమి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది.ఇది ఆర్థిక కార్యకలాపాలు మందగించడానికి కారణమవుతోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. కానీ కేంద్రం మాత్రం వీటికి వెన్నుదన్నుగా నిలవకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇప్పటికైనా కేంద్రం ఈ చిన్న పరిశ్రమలపై దృష్టి పెడితే పారిశ్రామిక రంగం కాస్తైనా కోలుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  12 Feb 2023 3:12 AM GMT
Next Story