Telugu Global
National

సిగ్గు సిగ్గు.. చేతగాని తనానికి సమర్థింపు కూడానా..?

భారత్ గురించి కేంద్రం గొప్పగా చెప్పుకోవాలంటే.. వేసిన కరోనా వ్యాక్సిన్లు, చేసిన జీఎస్టీ వసూళ్లు.. వీటి గురించి మాట్లాడుకోవాల్సిందే. భారత్ లో నిరుద్యోగత రేటు గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది.

సిగ్గు సిగ్గు.. చేతగాని తనానికి సమర్థింపు కూడానా..?
X

విదేశీ ఉద్యోగాల పేరుతో ఇటీవల మోసాలు జరుగుతున్నాయని, భారతీయ పౌరుల్ని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇటీవల మయన్మార్, థాయ్ లాండ్ లోని భారతీయ మిషన్ల ద్వారా 32మందిని రక్షించారు. తాజాగా మరో 13మందిని రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. ఆ 13మందిని తమిళనాడులోని స్వస్థలాలకు చేర్చామని గొప్పగా చెప్పుకున్నారాయన. భారత పౌరులకు తమ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదని, భారతీయులు ఎక్కడున్నా కాపాడి తీసుకొస్తామని బీజేపీ నేతలు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థుల్ని తీసుకొచ్చే క్రమంలో కూడా ఇలాంటి ప్రగల్భాలే పలికారు బీజేపీ నేతలు.

ఈ అవస్థలకు కారణం ఎవరు..?

ఉక్రెయిన్ లో వైద్య విద్యార్థులు అవస్థలు పడ్డా, మయన్మార్ లో ఉద్యోగాలకోసం వెళ్లి మోసపోయినా.. వీటన్నిటికీ కారణం ఎవరు..? చదువుకు అవకాశం కల్పించలేని, చదువు తర్వాత ఉద్యోగావకాశాలు ఇవ్వలేని కేంద్రానిదే బాధ్యత అనే విమర్శలు వినపడుతున్నాయి. భారత్ లోనే తగినన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వైద్య విద్యకోసం మన విద్యార్థులు అక్కడి వరకు వెళ్తారా, భారత్ లోనే సరైన ఉద్యోగ అకాశాలు ఉంటే.. మయన్మార్ వెళ్లి కష్టపడాల్సిన అవస్థ మన విద్యార్థులకు ఏంటి..? దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరు.

ఉద్యోగాల కల్పన విషయం కేంద్రం ఘోరంగా విఫలమైందనే విషయం ఇప్పుడిప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్లూ కరోనాపై నెపం నెట్టేసి ఊరుకున్నారు, కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా భారతీయులు విదేశాలవైపు చూస్తున్నారంటే ఇక్కడ వసతులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మయన్మార్, థాయి లాండ్ వంటి చిన్న చిన్న దేశాలు కూడా ఇక్కడి యువతకు ఎర వేస్తున్నాయి. ఆమధ్య జీడీపీ గొప్పగా ఉందని చెప్పుకునేవారేమో.. ఇటీవల అది కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. డాలర్ తో రూపాయి మారకం విలువ వెక్కిరిస్తోంది. నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ దశలో భారత్ గురించి కేంద్రం గొప్పగా చెప్పుకోవాలంటే.. వేసిన కరోనా వ్యాక్సిన్లు, చేసిన జీఎస్టీ వసూళ్లు.. వీటి గురించి మాట్లాడుకోవాల్సిందే. భారత్ లో నిరుద్యోగత రేటు గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. అందుకే విదేశాలకు యువత వలస వెళ్తోంది. వారిని కాపాడుతున్నామంటూ కేంద్రం చంకలు గుద్దుకుంటోంది. అంతేకాని, వారందరికీ ఇక్కడ ఉపాధి కల్పిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేకపోతోంది.

First Published:  6 Oct 2022 1:57 AM GMT
Next Story