Telugu Global
National

న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం.. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్

37 పేజీల్లో రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చెందిన అంశాన్ని నాలుగు సార్లు ప్రస్తావించారు.

న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం.. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్
X

జీ20 కూటమి సమావేశాలు ఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ తొలి రోజే అతిపెద్ద విజయాన్ని సాధించింది. పలు అంశాలపై సభ్య దేశాల మధ్య బేధాభ్రిపాయాలు ఉన్నా.. అభివృద్ధి, బౌగోళిక రాజకీయ అంశాలపై రూపొందించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. ఇది తొలి రోజు జరిగిన కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా.. డిక్లరేషన్ మాత్రం ఏకగ్రీవంగా ఆమోదం పొందడం గమనార్హం.

37 పేజీల్లో రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చెందిన అంశాన్ని నాలుగు సార్లు ప్రస్తావించారు. అణు బెదిరింపులు ఆమోదనీయం కాదన్న అంశంపై అన్ని సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయ. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని తీర్మానం పిలుపునిచ్చింది. నేటి కాలం యుద్ధాల శకం కాకూడదని అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టబడి ఉండాలని.. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను గౌరవించాలని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో న్యాయబద్దమైన, దీర్ఘకాలిక శాంతికి చర్యలు అవసరం. ఐక్యరాజ్య సమితి నిబంధనలకు గౌరవించాలి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం సరి కాదని డిక్లకేషన్‌లో పేర్కొన్నారు. ఆహార, ఇంధన భద్రత ప్రాముఖ్యతను గుర్తించి సైనిక విధ్వంసాన్ని, సంబంధిత మౌలిక వసతులపై దాడులు నిలిపివేయాలి. అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు కట్టుబడి ఉండాలి. సంక్షోభాలు, ఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఉన్నామని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాను. టెర్రరిస్టులకు సురక్షితమైన అవాసాలు, స్వేచ్ఛ, ఆర్థిక, వస్తు తోడ్పాటు, రాజకీయ మద్దతు లభించకుండా అంతర్జాతీయ సహకారం మరింతగా బలపడాలి. ఏ ఉద్దేశంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడినా అది సమర్థనీయం కాదు. ఉగ్ర నిధులపై కన్నేసి ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ వనరులను పెంచాలి. ఆయుధాల అక్రమ రవాణా కట్టడికి అంతర్జాతీయ సహకారం అవసరం. అలాగే భూతాపాన్ని కట్టడి చేయడానికి పారిస్ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు ఆయా దేశాలు తమ ఉద్గారాలు తగ్గించుకోవాలి. 2050 నాటికి నెట్ జోరో సాధించేలా లక్ష్యం పెట్టుకోవాలని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

ఇకపై జీ21..

జీ20 పరిధిని విస్తరించారు. జీ20 ఏర్పడిన తర్వాత తొలి సారిగా మరో కొత్త సభ్యుడికి అవకాశం కల్పించారు. ఇకపై ఆఫ్రికన్ యూనియన్‌ కూడా జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండనున్నది. ఈ మేరకు ఇండియా చేసిన ప్రతిపాదనను సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో జీ20 పేరును జీ21గా మార్చే అంశంపై ఆదివారం ప్రకటన చేసే అవకాశం ఉన్నది.

వ్యాపార సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రణాళికలను జీ20 సమావేశాల సందర్భంగా సభ్య దేశాధినేతలు ఆవిష్కరించారు. ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్ వరకు విస్తరించి ఉండే ఈ కారిడార్.. చైనా నిర్మిస్తున్న వన్ బెల్డ్-వన్ రోడ్‌కు కౌంటర్‌గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారిడార్ కనెక్టివిటీ.. సుస్థిర అభివృద్ధికి కొత్త దశను ఇస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

First Published:  10 Sep 2023 12:28 AM GMT
Next Story