Telugu Global
National

థాక్రే సేనకు త్రిశూలం లేదా సూర్యుడు..

'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్‌ థాక్రే' అనే పేర్లలో ఒకటి తమకు కేటాయించాలంటోంది థాక్రే వర్గం. ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ఈసీని కోరింది.

థాక్రే సేనకు త్రిశూలం లేదా సూర్యుడు..
X

యాజమాన్యంలో విభేదాలు వచ్చి వారసులు చెరో షాపు పెట్టుకుంటే.. అసలైన షాపు మాదంటే మాదంటూ బోర్డులు పెట్టుకుంటారు. ప్రస్తుతం శివసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. థాక్రే వర్గం, షిండే వర్గం అసలైన సేన తమదంటే తమది అని కొట్టుకుంటున్నాయి. చివరకు ఈసీ కూడా ఈ పంచాయితీని తేల్చలేక గుర్తుల్ని ఫ్రీజ్ చేసింది. అంటే ప్రస్తుతానికి శివసేన ఎవరిదీ కాదు, ఉన్నవల్లా షిండే సేన, థాక్రే సేన మాత్రమే.

మహారాష్ట్రలోని తూర్పు అంథేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మునుగోడుతోపాటు అక్కడ కూడా నవంబర్ 3న ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో థాక్రే సేన, షిండే సేన రెండూ పోటీ పడబోతున్నాయి. దీంతో ఇక్కడ గుర్తు వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతానికి శివసేన అనే పేరు, శివసేన గుర్తుగా ఉన్న విల్లు-బాణం కూడా ఎవరికీ సొంతం కావు. ఈ సమయంలో రెండు వేర్వేరు పార్టీ పేర్లు, రెండు వేర్వేరు గుర్తులు ఇరు వర్గాలకు తాత్కాలికంగా కేటాయించాల్సిన పరిస్థితి. ఉప ఎన్నికలో గెలుపు ధీమాతో ఉన్న థాక్రే సేన.. ఈసీ ముందు రెండు ప్రతిపాదనలు ఉంచింది.

'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్‌ థాక్రే' అనే పేర్లలో ఒకటి తమకు కేటాయించాలంటోంది థాక్రే వర్గం. ఎన్నికల గుర్తుగా కూడా రెండు ఆప్షన్లు ఇచ్చింది. త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ఈసీని కోరింది. ఫస్ట్ ఛాయిస్ గా శివసేన బాలా సాహెబ్ థాక్రే పేరు, త్రిశూలం గుర్తుని ఇవ్వాలని ఈసీని కోరింది థాక్రే వర్గం.

అసలైన శివసేన మాదే, నిజమైన శివసేన మాదేనంటూ ఇరు వర్గాలు కొట్టుకుంటుండటంతో ఉప ఎన్నికలో పేరు, గుర్తు ఎవరికీ లేకుండా ఫ్రీజ్ చేసింది ఈసీ. కొత్త పేరు, గుర్తు నిర్ణయించుకుని మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. థాక్రే వర్గం కాస్త ముందుగా ఆప్షన్లు ఇచ్చేసింది. ఈ విషయంలో షిండే వర్గం వెనకపడిందనే చెప్పాలి.

First Published:  9 Oct 2022 11:42 AM GMT
Next Story