Telugu Global
National

సిగరెట్ తాగుతూ.. నవ్వుతూ జనగణమన పాడిన యువతులు.. నెటిజన్లు ఫైర్

జాతీయ గీతాన్ని క్రమ పద్ధతిలో పాడకుండా తప్పు తప్పుగా పాడారు. అంతేకాదు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది.

సిగరెట్ తాగుతూ.. నవ్వుతూ జనగణమన పాడిన యువతులు.. నెటిజన్లు ఫైర్
X

జాతీయ గీతం `జనగణమన`ను దేశ ప్రజలు ఎంత గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాట వింటేనే జాతీయత పొంగుతుంటోంది. అకస్మాత్తుగా ఆ పాట వినిపించిన సమయంలో కూర్చున్న వారు కూడా నిల్చుంటారు. సమావేశాల్లో, సదస్సుల్లో ఒక్కటేమిటి ఏ కార్యక్రమం నిర్వహించినా చివర్లో జనగణమన పాడి గౌరవించడం భారతీయులు బాధ్యతగా భావిస్తుంటారు.

అంతటి గౌరవం ఉన్న జనగణమనను కోల్ కత్తాకు చెందిన ఇద్దరు యువతులు అపహస్యం చేశారు. చేతిలో సిగరెట్ పట్టుకుని తాగుతూ.. తుళ్లుతూ.. వెకిలిగా నవ్వుతూ జనగణమన పాడారు. జాతీయ గీతాన్ని క్రమ పద్ధతిలో పాడకుండా తప్పు తప్పుగా పాడారు. అంతేకాదు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది.

దీంతో ఆ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరు యువతులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ కాలుస్తూ.. వెకిలి చేష్టలు చేస్తూ జాతీయగీతం పాడతారా? అంటూ మండిపడుతున్నారు. మీరసలు భారతీయులేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో పోలీసుల కంటపడటంతో బరఖ్ పూర్ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇదిలా ఉండగా సదరు అమ్మాయిలు మాత్రం తమ స్నేహితుడితో పందెం కాసి ఆ విధంగా జాతీయ గీతాన్ని పాడి సోషల్ వీడియోలో షేర్ చేశామని చెప్పారు. విమర్శలు తీవ్రం కావడంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అమ్మాయిలకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది.

First Published:  11 April 2023 11:15 AM GMT
Next Story