Telugu Global
National

దళిత యువతిపై గ్యాంగ్ రేప్, హత్య.. నిందితుల్లో ఇద్దరు పోలీసులు

ఆమెను దినేష్ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ యువతిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను అలాగే వదిలేస్తే తాము చేసిన దారుణం ఎక్కడ వెలుగులోకి వస్తుందో అని హత్య చేశారు.

దళిత యువతిపై గ్యాంగ్ రేప్, హత్య.. నిందితుల్లో ఇద్దరు పోలీసులు
X

కంప్యూటర్ కోచింగ్ కోసం ఇంటి నుంచి ప‌ట్ట‌ణానికి వచ్చిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉండటం గమనార్హం. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.

బికనీర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి కంప్యూటర్ శిక్షణ తీసుకునేందుకు ప్రతిరోజూ ఉదయం ఖజువాలా పట్టణానికి వెళ్తోంది. ఈ యువతిని గత 15 రోజులుగా దినేష్ విష్ణోయ్ అనే వ్యక్తి అనుసరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. మంగళవారం ఉదయం యధావిధిగా యువతి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ వద్దకు బయలుదేరగా ఆ యువతిని.. పోలీస్ కానిస్టేబుళ్లు భగీరథ్ విష్ణోయ్, మనోజ్ విష్ణోయ్, మరో ఇద్దరు యువ‌కుల స‌హాయంతో దినేష్ కిడ్నాప్ చేశాడు.

అనంతరం ఆమెను దినేష్ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ యువతిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను అలాగే వదిలేస్తే తాము చేసిన దారుణం ఎక్కడ వెలుగులోకి వస్తుందో అని హత్య చేశారు. మృతదేహాన్ని ఖజువాలాలోని ఒక సినిమా థియేటర్ సమీపంలో పడేశారు.

ఉదయం కంప్యూటర్ కోచింగ్ కోసం వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించారు. ఈ నేరంలో పోలీస్ కానిస్టేబుళ్లు భగీరథ్ విష్ణోయ్, మనోజ్ విష్ణోయ్ ఉన్న‌ట్లు నిర్ధారించి వారిని విధులనుంచి సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  21 Jun 2023 1:19 PM GMT
Next Story