Telugu Global
National

జార్జియా ఎన్నిక‌ల్లో జోక్యం..ట్రంప్‌పై మరో అభియోగం

నిజానికి 2021లోనే ఎన్నికల్లో ట్రంప్ జోక్యంపై ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్‌ అటార్ని ఫనీ విల్లిస్ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై 98 పేజీల రిపోర్టును త‌యారు చేశారు. సోమ‌వారం ఆ తీర్పును ప్ర‌క‌టించారు.

జార్జియా ఎన్నిక‌ల్లో జోక్యం..ట్రంప్‌పై మరో అభియోగం
X

వచ్చే ఏడాది జ‌ర‌గ‌నునున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.. తాజాగా, ఆయనపై మరో అభియోగం నమోదయ్యింది. అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఫుల్టన్‌ కౌంటీ గ్రాండ్‌ జ్యూరీ జారీ చేసిన 41-ఛార్జి డాక్యుమెంట్‌లో ట్రంప్‌ సహా 18 మంది ఉన్నారు. వీరిలో ట్రంప్‌ మాజీ లాయర్‌ రూడీ గులియానీ, వైట్‌హౌస్ మాజీ చీఫ్‌ మార్క్‌ మెడోస్‌, వైట్‌‌హౌస్‌ లాయర్‌ జాన్‌ ఈస్ట్‌మన్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌‌కు చెందిన మాజీ న్యాయమూర్తి జెఫ్రీ క్లార్క్‌ తదితరులు ప్రముఖులు. ఈ కేసుతో గత కొన్ని నెలలలో ట్రంప్ క్రిమినల్‌ అభియోగాలను ఎదుర్కొనటం నాలుగోసారి.

నిజానికి 2021లోనే ఎన్నికల్లో ట్రంప్ జోక్యంపై ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్‌ అటార్ని ఫనీ విల్లిస్ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై 98 పేజీల రిపోర్టును త‌యారు చేశారు. సోమ‌వారం ఆ తీర్పును ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 25వ తేదీలోగా స‌రెండ‌ర్ కావాల‌ని, లేదంటే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. డొనాల్డ్‌కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే ఉద్దేశంతోనే సహ కుట్రదారులు ఇందులో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. అయితే అభియోగపత్రంలో వీరిని వ్యవస్థీకృత నేరగాళ్లతో పోల్చడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలాలు, పత్రాలు సృష్టించి.. ఫోర్జరీ, తప్పుడు సమాచారంతో వాటిని పూర్తిచేయడం, సాక్షులను ప్రభావితం చేయడం, దొంగతనం, చట్ట ఉల్లంఘన వంటి నేరాభియోగాలను వీరిపై మోపారు.

ప్రస్తుత కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం అభియోగాల్లో ‘ది రాకెటీర్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ అండ్‌ కరప్ట్‌ ఆర్గనైజేషన్స్‌ యాక్ట్‌’ (రికో) ఉల్లంఘన అత్యంత తీవ్రమైంది. అయితే ఈ ఆరోపణలపై ట్రంప్‌ బృందం స్పందించింది. ప్రాసిక్యూటర్‌ను పక్షపాతిగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు చేసినవారు 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని ఎదురుదాడికి దిగింది. ట్రంప్‌ ప్రచార ఆధిపత్యాన్ని వాళ్లు దెబ్బతీయాలని పయత్నిస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తోంది.

First Published:  15 Aug 2023 10:53 AM GMT
Next Story