Telugu Global
National

దేవుడా.. బతికి బయటపడ్డాం.. కారును ఢీకొడుతూ మూడు కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రాణభయంతో కేకలు పెడుతున్నప్పటికీ ఆ లారీ డ్రైవర్ పట్టించుకోలేదు. చివరకు మూడు కిలోమీటర్లు కారును ఈడ్చుకువెళ్లిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

దేవుడా.. బతికి బయటపడ్డాం.. కారును ఢీకొడుతూ మూడు కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ
X

ఉత్తర ప్రదేశ్ లో ముందు వెళ్తున్న కారును ఓ లారీ కొట్టింది. అయినా ఆ లారీ ఆగలేదు. నడిరోడ్డు గుండా కారును లాక్కెళుతూనే ఉంది. అలా ఒకటి రెండు కాదు మూడు కిలోమీటర్ల దూరం లారీ ఆగకుండా కారును ముందుకు తోసుకెళ్తూ వెళ్ళింది. చూపరులను ఈ సంఘటన భయకంపితులను చేసింది. ఇక కారులో ఉండే వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. వెనకనుంచి ఢీ కొడుతూ వస్తున్న లారీ ఎప్పుడు తమను తొక్కుకుంటూ ముందుకు వెళ్తుందో .. కారు వెళ్లి ఏ గోడకు గుద్దుకుంటుందో, ఏ గుంతల్లో పడుతుందో.. అని క్షణక్షణం నరకం అనుభవించారు.

అయితే చివరికి మూడు కిలోమీటర్లు వరకు కారును లాక్కెళ్ళిన తర్వాత లారీ ఆగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి కారులో వెళ్తుండగా మీరట్ నగరంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ కారును ఢీకొంది. అయితే కారును ఢీకొన్నప్పటికీ ఆ లారీ ఆగలేదు. అలాగే కారును ఢీకొడుతూ తోసుకుంటూ వెళ్ళింది.

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రాణభయంతో కేకలు పెడుతున్నప్పటికీ ఆ లారీ డ్రైవర్ పట్టించుకోలేదు. చివరకు మూడు కిలోమీటర్లు కారును ఈడ్చుకువెళ్లిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆ లారీని ఫాలో అవుతూ వచ్చిన వాహనదారులు, చుట్టుపక్కల వారు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ కారును ఈడ్చుకెళ్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మీరట్ పోలీసులు తెలిపారు.

First Published:  13 Feb 2023 11:04 AM GMT
Next Story