Telugu Global
National

వారసత్వం, బంధుప్రీతి.. ఆ విషయంలో బీజేపీ గురివింద నీతి..

ప్రధాని ఎర్రకోటపై ఈ ప్రవచనాలు ఇచ్చే సమయానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) కార్యదర్శిగా జై షా అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

వారసత్వం, బంధుప్రీతి.. ఆ విషయంలో బీజేపీ గురివింద నీతి..
X

ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర వజ్రోత్సవ ప్రసంగం విన్న ఎవరికైనా గురివింద గింజ గుర్తుకొస్తుంది. తన వెనక ఉన్న నలుపుని గుర్తించకుండా.. తన ముందున్న ఎరుపుని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు మోదీ. భారతదేశం ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, అందులో ఒకటి వారసత్వం, రెండోది బంధుప్రీతి అని సెలవిచ్చారు మోదీ. అంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకపోవడం... ఇవేవీ భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు కావన్నమాట. వాటిని సమస్యలుగా ప్రస్తావిస్తే మోదీ తన వైఫల్యాలను ఒప్పుకున్నారనుకోవాలి. అందుకే కొత్త సమస్యలంటూ వారసత్వం, బంధుప్రీతి లెక్క చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనుకుంటున్నారు.

వారసత్వ రాజకీయాలకు తాము దూరం అని చెబుతుంది బీజేపీ. కావాలంటే చూడండి.. బీజేపీలో పార్టీ పగ్గాలు వారసుల చేతుల్లో పెట్టాలని ఎవరూ అనుకోరు, అసలు తమ పార్టీయే కుటుంబ పాలన లేని పార్టీ అని గొప్పలు చెప్పుకుంటోంది. మరి బీజేపీలో ఉన్న నాయకుల సంగతేంటి..? వారసత్వం పార్టీకేనా, పార్టీ నాయకులకు లేదా అంటే మాత్రం కాషాయదళం నాలుక కరుచుకోవాల్సిందే. ప్రధాని ఎర్రకోటపై ఈ ప్రవచనాలు ఇచ్చే సమయానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) కార్యదర్శిగా జై షా అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అమిత్ షా కుమారుడు అనే ఒకే ఒక్క కారణంతో జై షాకి అవకాశమిచ్చారు. ఇవి వారసత్వ రాజకీయాలు కావా అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, టీఎంసీ నుంచి వచ్చిన సువేందు అధికారి.. వీరంతా రాజకీయ వారసులు కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అన్నీ గుర్తున్నాయని, వారసత్వ రాజకీయాలు బీజేపీలో కూడా ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్, భార్య రేణుకా బిష్ణోయ్ సహా ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తన కొడుకు భవ్య బిష్ణోయ్ ని అడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపాలని ఆయన ముందుగానే పథకం రచించారు. తాత, తండ్రి, కొడుకు.. ఈ రాజకీయ వారసత్వాన్ని బీజేపీ ఎలా సమర్థిస్తోంది, వారికి కాషాయ కండువా ఎందుకు కప్పింది..? కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ కుమారుడు, నోయిడా ఎమ్మెల్యే. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ పార్లమెంట్ సభ్యుడు. వీరంతా వారసత్వ రాజకీయాల వల్ల రాటుదేలారా, లేక సహజసిద్ధంగానే వారి శక్తి సామర్థ్యాలను చూసి ఆయా స్థానాలు కట్టబెట్టారా..?

కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పంజాబ్ నాయకుడు సునీల్ జాఖర్, కేంద్ర మాజీ మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్.. వీరంతా రాజకీయ వారసులే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీలో వారసులు రాజ్యమేలుతున్నారు, ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అంటున్న మోదీ, తన కేబినెట్‌లో ఎంతమంది వారసులున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. బంధుప్రీతి అనేది దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటున్న మోదీ, పార్లమెంట్‌లో ఉన్న బీజేపీ ఎంపీల్లో ఎంతమంది కీలక నేతల బంధువులో చెప్పాలని అడుగుతున్నాయి. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింథియా వీరంతా స్వయంకృషితో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చినవారేనా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి ఓ మాజీ ఎమ్మెల్సీ, ఫడ్నవీస్ అత్త గతంలో రాష్ట్ర మంత్రి.. ఇలా ఏ నాయకుడిని కదిలించినా ఎక్కడో ఓ చోట వారసత్వం కనపడుతుంది.

వంశపారంపర్య రాజకీయాలు మంచివి కావంటున్న బీజేపీ, కేవలం కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు మాత్రమే అలాంటి రాజకీయాలు చేస్తున్నాయని అంటోంది. కానీ బీజేపీలో ఎంతమంది వారసులు ఇప్పుడు తెరపైకి వచ్చారనే విషయాన్ని మాత్రం దాచి ఉంచాలనుకుంటోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, సహా ప్రాంతీయ పార్టీలపై దాడి చేసేందుకే ఇలా స్వాతంత్య్ర సంబరాల్లో బంధుప్రీతి, వారసత్వం అనే మాటల్ని ప్రధాని మోదీ ఉపయోగించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ఇదో ఎత్తుగడ అని బలంగా చెబుతున్నారు.

First Published:  17 Aug 2022 6:50 AM GMT
Next Story