Telugu Global
National

బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానదూరం ఎవరికి లాభం..?

బీజేపీల‌కు సమాన దూరం అనే కొన్ని పార్టీల ధోరణి మూడోసారి ప్రధాని కావాలన్న నరేంద్ర మోదీ వాంఛ నెరవేరడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది దేశం మరింత ప్రమాదంలో పడటానికి దారితీసే పరిణామం.

బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానదూరం ఎవరికి లాభం..?
X

రానున్న లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాల ఐక్యత అవసరం. దీనిని గుర్తించకుండా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని చెప్పడం అసంగతం. ఈ రెండు పార్టీలను ఒకేదృష్టితో చూడటం అసంబద్ధం. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతున్నారు. ఈ రెండు జాతీయ పార్టీలని పక్కనపెట్టి ఇతర పక్షాల ఐక్యతపై దృష్టి సారిస్తామంటున్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టాయి. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాల ముఖ్యమంత్రులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపిన విందు ఆహ్వానానికి సానుకూల స్పందన రాలేదు.

తొమ్మిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు సమానదూరమనే విధానం వినడానికే విడ్డూరంగా వుంది. బీజేపీ పాలనపై విసుగెత్తి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రజా సమూహాలకు సైతం ఇది అంగీకారం కాదు. రెండుసార్లు లోక్‌సభ ఎన్నికలలో గెలిచి సకల వ్యవస్థలని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీని వ్యతిరేకించడంలో అర్థం వుంది. అవసరమూ వుంది. కానీ, గత పాతికేళ్ళ కాలంలో కాంగ్రెస్‌ ఇంత అప్రజాస్వామికంగా ఏనాడూ వ్యవహరించలేదు. 1990 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టే కుతంత్రాలకు కాంగ్రెస్‌ పాల్పడలేదు.

కేంద్రంలో బీజేపీ రెండోసారి పగ్గాలు చేపట్టాక కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గోవా మొదలయిన రాష్ట్రాలలో ప్రజాతీర్పును త్రోసిరాజని బీజేపీ దుర్మార్గంగా వ్యవహరించిన తీరు తెలిసిందే. ఇలాంటి బీజేపీని, కాంగ్రెస్‌ని ఒకేగాటన కట్టడం ఆమోదనీయం కాదు. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతమైన విధానం.

తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌లలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే. కాంగ్రెస్‌ ఎంతమాత్రం కాదన్నది స్పష్టం. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రధానమైన సవాల్ బీజేపీ నుంచే ఎదురవుతోంది. కాంగ్రెస్‌ పునాదులలో బలంగా ఉన్న రాష్ట్రాలలో తన అభ్యర్థులను నిలబెడుతూ కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించాలన్న ఆప్‌ వ్యూహం గుజరాత్‌ ఎన్నికల్లో బెడిసికొట్టింది. అంతిమంగా అక్కడ బీజేపీకి లాభం చేకూర్చింది.

వందేళ్ళ పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ స్థానం ఆక్రమించడం అంత సులువు కాదు. ముఖ్యంగా విజన్‌ వుండాలి. విస్పష్టమైన విధానమూ కావాలి. ఈ రెండూ లోపించిన ఆప్‌ ప్రాంతీయ పార్టీ స్థాయిని దాటడం అంత సులువు కాదు. మరీ ముఖ్యంగా బీజేపీని ఓడించటానికి ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి చేసే ప్రయత్నానికి పరిమితులుంటాయి. అందుకని కాంగ్రెసేతర పక్షాలతో కలిసి బీజేపీని గద్దె దింపడమనే వ్యూహం ఓట్ల చీలికకు దారితీసి బీజేపీ గెలుపును సులభతరం చేస్తుంది.

జాతీయపార్టీగా అవతరించి దేశమంతటా విస్తరించాలన్న ఆకాంక్ష ఏ పార్టీకయినా ఉండొచ్చు. తప్పుకాదు. అయితే అందుకు తొలుత నిర్దిష్ట దృక్పథం, ప్రణాళిక అవసరం. ఈ దృష్టి, స్పష్టత ఉన్నందునే భారతీయ రాష్ట్ర సమితి (బీ.ఆర్‌.ఎస్‌.) ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా తొందర పడటం లేదు. మూడో ఫ్రంట్‌ గురించి మొదట మాట్లాడినప్పటికీ ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అదానీ కుంభకోణాల్ని నిలదీయడంలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా హాజరవుతున్నారు. బీజేపీ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రతిఘటించే ఉద్యమాల్లో భాగస్వామి కావడానికి బీఆర్‌ఎస్‌కు అభ్యంతరం లేదు. ఇదే సమయాన ఈ సమావేశాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ దూరంగా వుంది. ప్రతిపక్షాల అనైక్యతకు ఇది నిదర్శనం.

బీజేపీని ఓడించడం తమ ఒక్క పార్టీతోనే సాధ్యం కాదని కాంగ్రెస్‌కు తెలుసు. అలాగే ప్రతిపక్షాల కూటమికి ఎవరు నాయకత్వం వహించినా తమకు అభ్యంతరం లేదనే విధానాన్ని కాంగ్రెస్‌ తీసుకుంది. నిరంకుశ బీజేపీ పాలనకు స్వస్తి పలికే లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెస్‌ క్రియాశీలకంగా పని చేస్తుంది. ఈ నేపథ్యాన కాంగ్రెస్‌, బీజేపీల‌కు సమాన దూరం అనే కొన్ని పార్టీల ధోరణి మూడోసారి ప్రధాని కావాలన్న నరేంద్ర మోదీ వాంఛ నెరవేరడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది దేశం మరింత ప్రమాదంలో పడటానికి దారితీసే పరిణామం. అంతేగాక మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీల అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదు. కనుక విజ్ఞత, వివేచన, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించడం బీజేపీయేతర పార్టీల బాధ్యత.

First Published:  21 March 2023 12:49 PM GMT
Next Story