Telugu Global
National

అమానుషం.. భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త

జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ గ్రామానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ జరిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామని, త్వరలో మరి కొంతమందిని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.

అమానుషం.. భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త
X

రాజస్థాన్‌లో అమానుష సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యను భర్తే వివస్త్రను చేసి నడిరోడ్డులో ఊరేగించాడు. దుస్తులు విప్పవద్దని ఆమె ఎంత బతిమలాడినా భర్త వినిపించుకోలేదు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చోద్యం చూస్తూ ఉండిపోయారు. తనను వివస్త్రగా మార్చి వీధుల్లో ఊరేగిస్తున్న సమయంలో తనను కాపాడాలని ఆ మహిళ ఎంత వేడుకున్నప్పటికీ స్థానికులు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పైగా అందరూ తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. గురువారం జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడితో వెళ్లిపోవడంతో భర్త ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చి దాడికి పాల్పడడమే కాక నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించాడు.

ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 21 ఏళ్ల గిరిజన యువతికి ఇదివరకే వివాహం జరిగింది. అయితే ఆమె పక్కింట్లో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఆ యువతి సదరు యువకుడితో కలిసి ఇంటి నుంచి పరారైంది. దీంతో ఆమె భర్త, అత్తమామలు యువతి ఆచూకీ కోసం వెతికి ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు. ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. భర్త భార్యను ఓ స్తంభానికి కట్టేశాడు. ఆ తర్వాత ఆమె దుస్తులను తొలగించి వివస్త్రగా మార్చాడు. తన దుస్తులు విప్పవద్దని ఆ యువతి ఎంత బతిమాలినా భర్త వినిపించుకోలేదు.

ఆ తర్వాత అతడు ఆమెను నడిరోడ్డులోకి తీసుకెళ్లి వీధుల్లో నగ్నంగా ఊరేగించాడు. ఆ సమయంలో సాయం కోసం యువతి ఆర్తనాదాలు పెట్టినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. చాలామంది తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు రంగంలోకి దిగి ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త సహా 10 మందిపై వివిధ కేసులు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ గ్రామానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ జరిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామని, త్వరలో మరి కొంతమందిని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించడం కలవర పెట్టిందన్నారు. ఈ నీచమైన చర్యకు పాల్పడిన నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని ఆదేశించారు.

కాగా, మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే విమర్శించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాజస్థాన్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆమె మండిపడ్డారు.

First Published:  2 Sep 2023 9:38 AM GMT
Next Story