Telugu Global
National

టాన్స్‌జెండర్‌ అనేది ఎప్పటికీ కులం కాబోదు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు

హిజ్రాలను ప్రత్యేక కులంగా భావించి.. నమోదు చేయాలని బిహార్‌ లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హిజ్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

టాన్స్‌జెండర్‌ అనేది ఎప్పటికీ కులం కాబోదు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

ట్రాన్స్‌జెండర్‌ అనేది ఎప్పటికీ కులం కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని కులాల్లోనూ హిజ్రాలు ఉన్నారని.. ఫలానా కులం వారే హిజ్రాలుగా మారుతున్నారనే ఆధారాలు ఎక్కడా లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హిజ్రాలను ప్రత్యేక కులంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. `హిజ్రాలు ఇప్పటికే వారి జన్మతః ఉన్న కులంలోనే ఉన్నారు. ఇప్పుడు వారికి ప్రత్యేకంగా కులం ప్రకటించలేం. ఇలా చేయలేం కూడా` అని అత్యున్న‌త ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం బిహార్‌ లో కుల గణన జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంబంధిత కుల గణనకు చెందిన ఫాంలో స్త్రీ, పురుష, హిజ్రా కాలమ్‌లను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కులాలకు చెందిన కాలమ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో హిజ్రాలను ఏ కులంగా భావించాలనే సందేహం ఏర్పడింది. దీంతో వారిని ప్రత్యేక కులంగా భావించి.. నమోదు చేయాలని బిహార్‌ లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హిజ్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమకు ఇప్పటికే కులాలు ఉన్నాయని, తమను ప్రత్యేక కులంగా చూడాల్సిన అవసరం ఏముందని హిజ్రాలు తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.

First Published:  17 Oct 2023 9:41 AM GMT
Next Story