Telugu Global
National

రైల్వేల అభివృద్ధి మీటింగ్ పెట్టిన మరుసటి రోజే ఘోర ప్రమాదం

2022-2023లో కవాచ్ కోసం 272.30 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఫలితం ఏంటి..? ఒడిశాలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఈ వ్యవస్థ ఏమైపోయింది. అసలు కవాచ్ ఉందా, లేక ప్రచారం కోసమేనా.. అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

రైల్వేల అభివృద్ధి మీటింగ్ పెట్టిన మరుసటి రోజే ఘోర ప్రమాదం
X

జూన్ 1న ఢిల్లీలోని మానేక్షా సెంటర్‌ లో రైల్వే భద్రత, సాంకేతికతపై రెండు రోజుల ప్రత్యేక శిబిరాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సహా రైల్వే బోర్డు సీనియర్ అధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. రైల్వేల భద్రత, నూతన సాంకేతికతలను స్వీకరించడంపై చర్చించారు. ప్రధాని మోదీ సూచనలు పాటించాలన్నారు. ఇంతా జరిగిన మరుసటి రోజే ఘోర రైలు ప్రమాదం జరగడం విశేషం. చర్చలు, ఆలోచనలన్నీ పేపర్ కే పరిమితమవుతున్నాయని, వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం సాధ్యం కావడంలేదని మరోసారి రుజువైంది.

కవాచ్ ఎక్కడ..? ఏమైంది..?

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కవాచ్ వ్యవస్థతో రైలు ప్రమాదాలు ఇక జరగనే జరగవని అన్నారు అధికారులు. ఈ టెక్నాలజీతో భారత్ మరో ముందడుగు వేసిందన్నారు. కవాచ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు 2021-22 సంవత్సరంలో రూ.133 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. 2022-2023లో కవాచ్ కోసం 272.30 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఫలితం ఏంటి..? ఒడిశాలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఈ వ్యవస్థ ఏమైపోయింది. అసలు కవాచ్ ఉందా, లేక ప్రచారం కోసమేనా.. అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

వరుసగా మూడు రైళ్లు ఒకదాన్ని ఒకటి ఢీకొనడం, మృతుల సంఖ్య భారీగా ఉండటం.. ఇటీవల కాలంలో భారత రైల్వేలో ఇది అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు. ఓవైపు వందే భారత్ అంటూ హడావిడి చేస్తున్న కేంద్రం ఈ ప్రమాదానికి ఏమని సమాధానం చెబుతోందంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. రైల్వే మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.

కవాచ్ సాంకేతికత అయినా, వందే భారత్ ప్రత్యేక రైళ్లు అయినా.. కేంద్రం ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కానీ.. వాస్తవిక దృక్పథంతో ఆలోచించడంలేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. కరోనా ఎపిసోడ్ తర్వాత రైళ్లలో రాయితీలు ఎత్తేశారు. చార్జీలు పెంచారు, ప్యాసింజర్ సర్వీసుల్ని ఎక్స్ ప్రెస్ లుగా మార్చేసి ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. స్పెషల్ ట్రైన్స్ అనే పేరుతో మరో దోపిడీ ఉండనే ఉంది. ఆదాయ మార్గాలు వెదుకుతున్న రైల్వే.. అదే సమయంలో భద్రతపై ఫోకస్ పెట్టకపోవడం దారుణం అంటున్నారు. ఏదేమైనా ఈ ఘోర ప్రమాదం మాత్రం భారత రైల్వేకి మాయని మచ్చలా మారుతుందనడంలో అనుమానం లేదు.

First Published:  3 Jun 2023 2:05 AM GMT
Next Story