Telugu Global
National

శశి థరూర్ కు మ‌ల్లికార్జున ఖర్గే ఏం చెప్పారు ?

అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థిని కలిగి ఉండటం చాలా మంచిది అని శశి థరూర్ కు మ‌ల్లికార్జున ఖర్గే చెప్పారట. పార్టీ సీనియర్ నేతల ఒత్తిడి మేరకే తాను పార్టీ అధ్యక్ష పదవి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే తెలిపారు.

శశి థరూర్ కు మ‌ల్లికార్జున ఖర్గే ఏం చెప్పారు ?
X

కాంగ్రెస్ పార్టీ రాబోయే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులలో ఒకరైన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు మాట్లాడుతూ, "అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థిని కలిగి ఉండటం చాలా మంచిది" అని తన‌తో పోటీలో ఉన్న అభ్యర్థి శశి థరూర్‌తో చెప్పాన‌ని కాంగ్రెస్ అద్య‌క్ష ప‌ద‌వికి పోటీలో ఉన్న‌ మ‌ల్లికార్జున ఖ‌ర్గే చెప్పారు. ఆదివారంనాడు ఆయ‌న మాట్లాడుతూ ..పార్టీ సీనియర్ నేతల ఒత్తిడి మేరకే తాను పార్టీ అధ్యక్ష పదవి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపారు. గాంధీ కుటుంబీకులెవ‌రూ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌క పోవ‌డంతో సీనియ‌ర్ స‌మ‌చ‌రులంతా తన‌ను పోటీ చేయాల‌ని కోరార‌ని చెప్పారు. తాను ఎవ‌రికీ వ్య‌తిరేకంగా పోరాడ‌డం లేద‌ని, కాంగ్రెస్ సిద్ధాంతం కోసం పోటీలో ఉన్నాన‌ని చెప్పారు.

పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి, మార్పులు అంటూ థ‌రూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ ఆ విష‌యాల‌ను ప్ర‌తినిధులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయిస్తుంది. ఎవ‌రో ఒక వ్య‌క్తి వ‌ల్ల కాదు. ఇవ‌న్నీ స‌మ‌ష్టిగా తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు అని ఖ‌ర్గే అన్నారు. నిన్న థ‌రూర్ త‌న ప్ర‌చారంలో భాగంగా మాట్లాడుతూ.. పార్టీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి తెలుసు. మార్పు కావాలంటే న‌న్ను గుర్తుంచుకోండి అంటూ ప్ర‌తినిధుల ఓట్ల‌ను అభ్య‌ర్ధించిన విష‌యం తెలిసిందే.

దీనిపై ఖ‌ర్గే మాట్లాడుతూ.. "నేను మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను. నేను ఎప్పుడూ నా సిద్ధాంతం, నీతి కోసం పోరాడుతూనే ఉంటాను. నేను ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేశాను. నేను ఇప్పుడు మళ్లీ పోరాడాలనుకుంటున్నాను. అదే నీతి,అదే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను" అని చెప్పారు. తాను కేవ‌లం ద‌ళిత నాయ‌కుడిగా పోటీ చేయ‌డం లేదు. కాంగ్రెస్ నాయ‌కుడిగానే పోరాటం చేస్తున్నాను అని వివ‌రించారు.

కాగా, తాను నామివ‌నేష‌న్ ను ఉప‌సంహ‌రించుకునే ఆలోచ‌న లేద‌ని థ‌రూర్ స్ప‌ష్టం చేయ‌డంతో కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక అనివార్య‌మ‌య్యే ప‌రిస్థితులు ఉన్నాయి. ఎన్నిక ఈ నెల 17 వ‌తేదీన జ‌రుగుతుంది. 19 వ తేదీన ఫ‌లితం వెల్ల‌డ‌వుతుంది.

First Published:  2 Oct 2022 10:51 AM GMT
Next Story