Telugu Global
National

ఈరోజు ప్రపంచ 'ఐస్ క్రీమ్ డే'.. ఎలా మొదలైందో తెలుసా..?

ప్రతి ఏడాది జూలై నెలలో వచ్చే మూడో ఆదివారం 'ఐస్ క్రీమ్ డే' గా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ అమెరికా నుంచి మొదలై ప్రపంచ వ్యాప్తమైంది.

ఈరోజు ప్రపంచ ఐస్ క్రీమ్ డే.. ఎలా మొదలైందో తెలుసా..?
X

అమ్మకి ఓ రోజు, నాన్నకి ఓ రోజు, ఫ్యామిలీకి, ఫ్రెండ్‌షిప్ కి, ప్రేమకి.. ఇలా ప్రతి దానికీ ఓ రోజు కేటాయించడం, ఆ పేరుతో ఆ రోజుని జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చేస్తోంది. మరి ఐస్‌క్రీమ్ కి కూడా ఓరోజు ఉంటుంది కదా, అదెప్పుడు అనుకుంటున్నారా..? అది ఈరోజే. ప్రతి ఏడాది జూలై నెలలో వచ్చే మూడో ఆదివారం 'ఐస్ క్రీమ్ డే' గా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ అమెరికా నుంచి మొదలై ప్రపంచ వ్యాప్తమైంది.

'ఐస్ క్రీమ్ డే' రోజు ఏం చేస్తారు..?

మన దగ్గర ఈ 'ఐస్ క్రీమ్ డే' ఇంకా ఫుల్ స్వింగ్‌లోకి రాలేదు కానీ, విదేశాల్లో మాత్రం ఈరోజు రకరకాల వెరైటీలు లాగించేస్తుంటారు ఐస్‌క్రీమ్ ప్రియులు. తమ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఐస్‌క్రీమ్ పార్లర్స్ లో పార్టీలు ఇస్తుంటారు. వీరికోసం ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ షాపుల్లో డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త కొత్త ఫ్లేవర్లు ఎదురు చూస్తుంటాయి. ఐస్ క్రీమ్ డే రోజు మొత్తం.. ఇతర ఆహార పదార్థాలను పక్కనపెట్టి కేవలం 'ఐస్ క్రీమ్' తోనే కాలం గడిపేవారు కూడా ఉంటారు.

ఎలా మొదలైంది..?

పూర్వం పర్షియా రాజ్యంలో ఐస్ క్రీమ్ ల ప్రస్తావన ఉండేది. అప్పట్లో ఐస్‌క్రీమ్ అనే ప్రత్యేక పదార్థం ఉండేది కాదు కానీ, మంచు పర్వతాలనుంచి ప్రత్యేకంగా సేకరించిన మంచు గడ్డలపై చిక్కని వైన్ వేసుకుని భోజనం తర్వాత దాన్ని సేవించేవారు. విందు భోజనాల తర్వాత ఇలా తినడం కోసం ముందుగానే మంచుని సేకరించి నేలమాళిగల్లో ఐస్‌బాక్స్ లు లాంటివి ఏర్పాటు చేసి వాటిలో దాచి ఉంచేవారు. ఇక ఐస్ క్రీమ్ ని మొదటగా తయారు చేసిన ఘనత మాత్రం ఇటలీకి దక్కుతుంది. ఆంటోనియో లాటిని అనే వ్యక్తి ఐస్ క్రీమ్ సృష్టికర్త. 1642లో అతను జన్మించాడు. ఆ తర్వాత అమెరికాలోని న్యూయార్క్ లో ఐస్ క్రీమ్ తయారీ ఊపందుకుంది. ఆ ఫార్ములా కూడా జనంలోకి వెళ్లింది.

ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ 1984లో జూలైని ఐస్ క్రీమ్ మంత్ గా జరుపుకోవాలని సూచించారు. జూలై మూడో ఆదివారాన్ని నేషనల్ ఐస్ క్రీమ్ డే గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రకటించారు. అలా అప్పటినుంచి అమెరికాలో ప్రతి ఏడాది జూలై మూడో ఆదివారం నేషనల్ ఐస్ క్రీమ్ డే గా జరుపుకుంటున్నారు. తర్వాత అదే ప్రపంచ ఐస్ క్రీమ్ డే గా మారింది.

First Published:  17 July 2022 9:04 AM GMT
Next Story