Telugu Global
National

ఇక్కడ గుడ్ మార్నింగ్ సీఎం.. అక్కడ గుడ్ మార్నింగ్ యమ..

బెంగళూరు అభివృద్ధి సంస్థ (BDA) యముడికి టెండర్ ఇచ్చారని, అందుకే యమధర్మరాజు ఈ రోడ్లపైకి వచ్చారంటూ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ లు పెట్టారు.

ఇక్కడ గుడ్ మార్నింగ్ సీఎం.. అక్కడ గుడ్ మార్నింగ్ యమ..
X

ఏపీలో రోడ్లపై గంతలు ఉన్నాయంటూ జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. రెండు రోజుల తర్వాత ఆ హడావిడి తగ్గిపోయింది. పక్క రాష్ట్రాల్లో రోడ్లు ఎంత సొంపుగా ఉన్నాయో ఓసారి చూడండి అంటూ వైసీపీ ఈ క్యాంపెయిన్ కి కౌంటర్ ఇచ్చింది కూడా. దీన్ని కేవలం పొలిటికల్ కౌంటర్ అనుకోలేం. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవి ఎంత దారుణంగా ఉన్నాయో..? వాటి నాణ్యత ఏపాటిదో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే తో అర్థమైంది. తాజాగా బెంగళూరు రోడ్ల దుస్థితి సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. కర్నాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు సిటీలో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఛేంజ్ మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్ (CMKR) అనే సంస్థ వినూత్న నిరసన మొదలు పెట్టింది.

యముడు, దున్నపోతు..

బెంగళూరు రోడ్ల దుస్థితిపై CMKR అనే స్వచ్ఛంద సంస్థ చాన్నాళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. ఇటీవల కాస్త వెరైటీగా యముడు వేషధారణలో ఉన్న వ్యక్తి దున్నపోతుని లాక్కెళ్తున్నట్టుగా ఈ రోడ్లపై ప్రదర్శన చేపట్టారు. ఈ గతుకుల రోడ్లపై ప్రయాణిస్తే యముడినుంచి వెంటనే కాల్ వస్తుందని, యమలోకానికి వెళ్లాల్సిందేనని అంటున్నారు. ఈ రోడ్లపై తిరిగిన వారందర్నీ పైకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే కృష్ణప్ప, బెంగళూరు అభివృద్ధి సంస్థ (BDA) యముడికి టెండర్ ఇచ్చారని, అందుకే యమధర్మరాజు ఈ రోడ్లపైకి వచ్చారంటూ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ లు పెట్టారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హడావిడిగా స్థానిక నేతలు బెంగళూరులోని రోడ్లకోసం 25కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా కేవలం 2 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేసి సరిపెట్టారు. తూతూ మంత్రంగా పనులు చేసి వదిలేశారు. దీంతో మరోసారి CMKR సభ్యులు పోరాటం మొదలు పెట్టారు. మళ్లీ యముడు, దున్నపోతుని రోడ్లపైకి తెచ్చారు. రద్దీ రోడ్లపై ఈ ప్రదర్శనలు చేపట్టి ప్రభుత్వం పరువు తీస్తున్నారు. నెటిజన్లు కూడా ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ట్రోలింగ్ తో చెలరేగిపోతున్నారు. మొత్తమ్మీద వినూత్న నిరసనలతో అయినా బెంగళూరు వాసులకు కొత్త రోడ్లు వస్తాయేమో చూడాలి.

First Published:  26 July 2022 2:06 AM GMT
Next Story