Telugu Global
National

శివసేన పేరు, చిహ్నాన్ని కొనుగోలు చేసేందుకు రూ. 2,000 కోట్ల ఒప్పందం: ఈసీ పై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

2,000 కోట్ల డీల్ 100 శాతం నిజమని రౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ఆరోపణలను రుజువులతో సహా త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

శివసేన పేరు, చిహ్నాన్ని కొనుగోలు చేసేందుకు రూ. 2,000 కోట్ల ఒప్పందం: ఈసీ పై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
X

శివసేన పేరు, చిహ్నాన్ని ఏకనాథ్ షిండే వర్గానికి కేటాయించాలని ఎన్నికల సంఘం (EC) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పేరు, చిహ్నాన్ని కొనుగోలు చేయడానికి "రూ. 2000 కోట్ల డీల్" జరిగిందని పేర్కొన్నారు.

2,000 కోట్ల డీల్ 100 శాతం నిజమని రౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ఆరోపణలను రుజువులతో సహా త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

శివసేన పేరును "కొనుగోలు" చేయడానికి రూ. 2,000 కోట్లు తక్కువ మొత్తం కాదని రౌత్ ఆదివారం అన్నారు."EC నిర్ణయం ఒక ఒప్పందం" అని ఆయన ఆరోపించారు.

అధికార యంత్రాంగానికి దగ్గరగా ఉన్న ఓ బిల్డర్ తనతో ఈ సమాచారాన్ని పంచుకున్నారని ఆయన విలేకరులతో అన్నారు.

అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ సంజయ్ రౌత్ ఆరోపణలను తోసిపుచ్చారు. సంజయ్ రౌత్ అర్ద‍లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎన్నికల సంఘం శుక్రవారం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, దానికి 'విల్లు, బాణం' ఎన్నికల గుర్తును కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఉపఎన్నికలు పూర్తయ్యే వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించిన "కాగడా" పోల్ గుర్తును ఉంచుకోవడానికి EC అనుమతించింది.

First Published:  19 Feb 2023 8:46 AM GMT
Next Story