Telugu Global
National

'ది కేరళ స్టోరీ'ని వ్యతిరేకిస్తే ISIS కు మద్దతిచ్చినట్టే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

బీజేపీని వ్యతిరేకిస్తే పాకిస్తాన్ కు మద్దతిచ్చినట్టే. బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహులకిందే లెక్క. మోడీ నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇలాంటి మాటలు బీజేపీ నేతలు అలవోకగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ అదే వాదన బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మొదలు పెట్టారు.

ది కేరళ స్టోరీని వ్యతిరేకిస్తే  ISIS కు మద్దతిచ్చినట్టే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
X

తమకు మద్దతివ్వకపోతే ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టే అని ఇరాక్ పై అమెరికా యుద్ద సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అన్న మాటలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. తమకు మద్దతివ్వకపోతే తమ శత్రువులకు మద్దతిచ్చినట్టే భావించిన నాజీ హిట్లర్ మొదలుకొని ఇప్పటి నయా నియంతల దాకా అదే వాదన చేస్తున్నారు.

ముఖ్యంగా ఇలాంటి వాదనలు చేయడంలో బీజెపి నాయకులు ముందుంటారు. బీజేపీని వ్యతిరేకిస్తే పాకిస్తాన్ కు మద్దతిచ్చినట్టే. బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహులకిందే లెక్క. మోడీ నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇలాంటి మాటలు బీజేపీ నేతలు అలవోకగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ అదే వాదన బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మొదలు పెట్టారు.

'ది కేరళ స్టోరీ' మూవీని వ్యతిరేకిస్తే నిషేధిత PFI, ఉగ్రవాద సంస్థ ISIS మద్దతిచ్చినట్టే అని అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు.

ఆదివారం గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఠాకూర్ మాట్లాడుతూ, ఆ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు ఉగ్రవాద సంస్థ PFI , ISIS యొక్క ఎజెండాకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.

హిందూ, క్రిస్టియన్ బాలికలను బలవంతంగా ఉగ్రవాదంలోకి నెట్టే కుట్రను “ది కేరళ స్టోరీ” బయటపెట్టిందని ఆయన‌ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కర్ణాటకలో చేసిన ప్రసంగంలో ఈ చిత్రాన్ని ప్రస్తావిస్తూ, “'ది కేరళ స్టోరీ' ఒక సమాజంలో, ముఖ్యంగా కష్టపడి పనిచేసే, ప్రతిభావంతుల భూమి అయిన కేరళ వంటి రాష్ట్రంలో ఉగ్రవాదం పరిణామాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తోంది." అన్నారు.

మరో వైపు రాష్ట్రంలో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంటుందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించగా, తమ‌ రాష్ట్రంలో పన్ను మినహాయింపు కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తామని ఉత్తరప్రదేశ్ మంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పారు.

శాంతిభద్రతల సమస్యలు, ప్రజల స్పందన సరిగా లేదని పేర్కొంటూ తమిళనాడు అంతటా మల్టీప్లెక్స్‌లు ఆదివారం నుండి వివాదాస్పద కేరళ స్టోరీ చిత్ర‌ ప్రదర్శనలను రద్దు చేశాయి. కేరళలో కూడా అనేక థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శన నిలిపి వేశారు.

First Published:  8 May 2023 3:55 AM GMT
Next Story