Telugu Global
National

దసరా రోజు జనం రావణుడిని కాల్చారు.... ఆయన తిరిగి జనం పైకి కాల్పులు జరిపాడు!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ రావణ దహన కార్యక్రమంలో జనాలు రావణుడిని కాల్చితే రావణుడు తిరిగి జనాల పైకి బాణా సంచాలు వదిలాడు. అక్కడున్న పోలీసులు, జనాలు తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది.

దసరా రోజు జనం రావణుడిని కాల్చారు.... ఆయన తిరిగి జనం పైకి కాల్పులు జరిపాడు!
X

దసరా రోజు ఉత్తరాదిన రావణ దహన‌ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. రావణుడి బొమ్మలు పెట్టి వాటిని కాల్చడం అక్కడ ఆనవాయితీ. చాలా చోట్ల రావణుడి బొమ్మలో పెద్ద ఎత్తున బాణా సంచాను కూడా పెడతారు. అలా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్ర‌మంలో జనాలు రావణుడిని కాల్చితే రావణుడు తిరిగి జనాల పైకి బాణా సంచాలు వదిలాడు. అక్కడున్న పోలీసులు, జనాలు తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం జరిగిన రావణ దహన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ముజఫర్‌నగర్‌లోని ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల మైదానంలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే కార్యక్రమం జరిగింది అది చూడడానికి వేలాదిగా జనం హాజరయ్యారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. రావణుడి బొమ్మలో పెద్ద ఎత్తున బాణాసంచాను నింపిన నిర్వాహకులు దాన్ని కాల్చారు. అయితే మంటలు అంటుకోగానే లోపలున్న బాణా సంచా జనాల మీదికి దూసుకొచ్చింది. దాంతో భయ‌పడిపోయిన జనం తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు. పోలీసులు కూడా జనంతో పాటు కాలుకు బుద్ది చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారి. ''రావణుడు పగ తీర్చుకున్నాడు'' అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.

హర్యాణా లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. హర్యానాలోని యమునానగర్ లో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయగానే పెద్ద ఎత్తున మంటలు అంటుకొని ఆ బొమ్మ కింద పడిపోయింది. ఆ బొమ్మలోంచి బాణా సంచా జనాల మీదికి దూసుకొచ్చింది. ఇక్కడ కూడా జనాలు కకావికలై పరుగులు పెట్టారు.



First Published:  6 Oct 2022 11:32 AM GMT
Next Story