Telugu Global
National

ఆ రేపిస్టులు సంస్కారవంతమైన బ్రాహ్మలట!

గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మంది రేపిస్టులు సంస్కారవంతమైన బ్రాహ్మలని, వాళ్ళకుటుంబాలు చాలా గొప్పవని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సికె రౌల్జీ వ్యాఖ్యానించారు. దురుద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టి ఉండవ‌చ్చని ఆయన అన్నారు.

ఆ రేపిస్టులు సంస్కారవంతమైన బ్రాహ్మలట!
X

గుజరాత్ లో బిల్కిస్ బానో అనే మహిళను సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను ఏడుగురిని హత్య చేసిన 11 మంది రేపిస్టులు, హంతకులు సంస్కారవంతమైన బ్రాహ్మలట.వాళ్ళ కుటుంబాలు చాలా గొప్పవట. ఈ మాటలన్నది బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సికె రౌల్జీ.

మోజో స్టోరీ అనే న్యూస్ పోర్టల్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే సికె రౌల్జీ, "క్రైమ్ కియా కీ నహీ కియా, హమ్ కో పతా నహీ హై. (వారు నేరం చేశారో లేదో నాకు తెలియదు) కానీ వారి కుటుంబ కార్యకలాపాలు చాలా బాగున్నాయి, వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మంచి సంస్కారం కలిగి ఉంటారు. ప్రజలు దురుద్దేశంతో వాళ్ళపై కేసు పెట్టి ఉండవ‌చ్చు. వారిని శిక్షించడం,వారిని జైలులో ఉంచడం వెనుక దురుద్దేశాలు ఉండవచ్చు." అని అన్నాడు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి వేసిన గోద్రా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుజల్ మయాత్ర నేతృత్వంలోని కమిటీలో ఎమ్మెల్యే సికె రౌల్జీ కూడా సభ్యుడు. ఆ కమిటీ ఈ 11 మంది రేపిస్టుల విడుదల కోసం ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.

ఆ 11 మంది విడుదలయ్యాక అనేక హిందుత్వ బృందాలు వాళ్ళకు సన్మానాలు జరిపాయి. స్వీట్లు పంచుకొని పండుగ చేసుకున్నాయి. ఇక బీజేపీ నేతలైతే ప్రతి రోజూ ఆ రేపిస్టుల గ్రామానికి చక్కర్లు కొడుతున్నారు. వాళ్ళ విడుదలకు అత్యంత కృషి చేసిన బీజేపీ ఎమ్మెల్యే సికె రౌల్జీ వాళ్ళ పట్ల చాలా ఆప్యాయతతో మాట్లాడారు. అయితే ఆ 11 మంది సంస్కారవంతమైన బ్రాహ్మలు అని ఆయన అన్న మాటలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజనులు ఆయన పై విమర్షల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లోని అర్దం ఏమిటో మనం ఆలోచించవలసి ఉన్నది. ఆయన ఉద్దేశంలో సంస్కారవంతమైన బ్రాహ్మలు రేపులు చేయరనా లేక వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనా అనేది తేలాల్సి ఉన్నది.

First Published:  19 Aug 2022 2:51 AM GMT
Next Story