Telugu Global
National

చంద్రయాన్‌లో మహిళా శక్తి

చంద్రయాన్‌–3 మిషన్‌లో సైంటిస్టులు, ఉద్యోగులు, సిబ్బందిలో మొత్తం 54 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేర్చే డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి నుంచి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వరకు అనేక స్థాయిల్లో పనిచేస్తూ, కీలకమైన, భారత్‌కు గర్వకారణమైన ఈ ప్రాజెక్టును విజయవంతం చేశారు.

చంద్రయాన్‌లో మహిళా శక్తి
X

చంద్రయాన్-3 సాఫ్ట్ లాండింగ్ ఇస్రో సాధించిన ఘన విజయం. ఇది ఇస్రో శాస్త్రవేత్తల కృషి, పరిశ్రమ, పట్టుదల, కార్యాచరణ, సాఫల్యం. శాస్త్రవేత్త అన్న మాటలో పురుషుడా, మహిళా అన్న తేడా ఉండకపోవచ్చు.. కానీ, మనుషుల్లో ఇంకా ఆ తేడాలున్నాయి. అందుకే మనం చంద్రయాన్-3 గురించి చదివేటప్పుడు అందులో పనిచేసిన మహిళల గురించి తెలుసుకోవాలి, వారినుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి.



ఇస్రో సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగం అయ్యారు. ముఖ్యంగా ‘చంద్రయాన్‌–3’ ప్రాజెక్ట్‌లో రీతూ కరిధాల్‌ నుంచి కల్పనా కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇస్రో సైంటిస్ట్‌ కావాలనుకుంటున్నాను అని కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతలు అయ్యారు.



అన్ని దశలను పూర్తి చేసుకొని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి అడుగు పెట్టిన క్షణం.. ఒక చారిత్రక సందర్భం. కానీ, ఆ క్షణం వెనుక కొన్ని లక్షల కోట్ల క్షణాల కృషి ఉంది. ఒక అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన ‘చంద్రయాన్‌–3’లో భాగమైన అనేకమంది మహిళలలో రాకెట్ ఉమెన్ రీతు కరిధాల్‌, ఇస్రో స్పేస్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సీతా సోమసుందరం, చంద్రయాన్‌–3 మిషన్‌లో అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న కల్పనా కాళహస్తి, చంద్రయాన్-3కి వ్యాఖనం అందించిన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ డిప్యూటీ మేనేజర్‌ మాధురి ఇలా ఎందరో.. మనకి తెలిసిన మనం చెప్పుకున్న పేర్లు చాలా తక్కువ.. చంద్రయాన్‌–3 మిషన్‌లో సైంటిస్టులు, ఉద్యోగులు, సిబ్బందిలో మొత్తం 54 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేర్చే డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి నుంచి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వరకు అనేక స్థాయిల్లో పనిచేస్తూ, కీలకమైన, భారత్‌కు గర్వకారణమైన ఈ ప్రాజెక్టును విజయవంతం చేశారు.



ఇదంతా తెలుసుకున్న తరువాత అస్సలు అడగాల్సిన అవసరం లేని ప్రశ్న ఎంటో తెలుసా.. ఇస్రోకు చైర్‌ ఉమన్‌ (చైర్‌ పర్సన్‌) ఎప్పుడూ? అని.. దీనికి జవాబు నా కళ్లకు కనిపిస్తోంది.. మరి మీకు?

First Published:  24 Aug 2023 11:08 AM GMT
Next Story