Telugu Global
National

మల్లికార్జున్ ఖర్గే ముందున్న ప్ర‌ధాన సవాళ్లు ఇవే !

కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే ముందు అనేక సవాళ్ళున్నాయి. కాంగ్రెస్‌ను పునర్నిర్మించడం, ప్ర‌త్యామ్నాయ విధానం తయారు చేయడం, ప్రజలకు పార్టీ తరపున బ‌ల‌మైన సందేశం ఇవ్వడం లాంటి వాటిలో ఆయన ఎంత వరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

మల్లికార్జున్ ఖర్గే ముందున్న ప్ర‌ధాన సవాళ్లు ఇవే !
X

అంతా ఊహించిందే అయిన‌ప్ప‌టికీ జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా మ‌ల్లికార్జున ఖ‌ర్గే విజ‌యం పార్టీ లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం వెల్లివిరుస్తోంద‌న్న సంకేతాలు పంప‌డ‌మే గాక పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. దాదాపు 24 యేళ్ళ త‌ర్వాత అఖిల భార‌త కాంగ్రెస్ కు తొలిసారిగా గాంధీ-నెహ్రూ కుటుంబ‌యేత‌ర వ్య‌క్తి అధ్య‌క్షుడు కావ‌డం మామూలు విష‌యంకాదు. నేత‌ల మ‌ధ్య ఎన్ని వైరుధ్యాలు విభేదాలు ఉన్నా ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి పార్టీలో ప్రజాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు అంతా ఏక‌మ‌య్యారు. అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం మిగతా పార్టీల‌లో క‌న‌బ‌డ‌దు అంటూ కాంగ్రెస్ విమ‌ర్శించేందుకు వీలైంది.

దశాబ్దాల తర్వాత దళిత సామాజికవర్గం నుంచి కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారు. జగ్జీవన్ రామ్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో దళిత నాయకుడు. అన్నింటికంటే ముందు తాను నెహ్రూ-గాంధీ కుటుంబం క‌నుస‌న్న‌ల్లో న‌డిచే వ్య‌క్తిని కాన‌ని, తాను స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోగ‌ల వ్య‌క్తిన‌ని ఖ‌ర్గే నిరూపించుకోవ‌డం ఆయన‌ ముందున్న త‌క్ష‌ణ‌ స‌వాల్‌.

2019లో ఒక్కసారి తప్ప, ఖర్గే ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఆయ‌న‌కు ఓటమి లేని నాయకుడు అనే పేరు ఉంది.

కాంగ్రెస్‌ను పునర్నిర్మించడం

గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ ను పాత పద్ధతిలోనే న‌డిపించ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. ఎంతో ఘ‌న‌మైన చ‌రిత్ర‌, ఎన్నో విజ‌యాలు అంటూ పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నంత‌మాత్రాన పార్టీకి పూర్వ వైభ‌వం రాదు. ప్ర‌జల దృష్టిని, ముఖ్యంగా ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి, వారి మ‌న‌సులో స్థానం సంపాదించ‌డానికి వీలుగా కొత్తగా ప్ర‌య‌త్నాలు ప్రారంభంకావాల్సి ఉంటుంది.

పార్టీ రాజకీయ సందేశం కొత్తగా ఉండాలి. హిందుత్వ, ఆర్థిక విధానం, జాతీయత నేపథ్యంలో మైనారిటీలకు సంబంధించిన ప్రశ్నలు వంటి అనేక సైద్ధాంతిక అంశాలపై స్పష్టత లేదనే భావ‌న‌కు స్వ‌స్తి ప‌లకాలి. ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయకులు విభేదాలు విడ‌నాడాలి. అందుకు అధ్య‌క్షుడు చ‌ర్య‌లు తీసుకోవాలి.

బ‌ల‌మైన సందేశం, ప్ర‌త్యామ్నాయ విధానం ఉండాలి

ఉదారవాద, ప్రగతిశీల, ప్రజాస్వామిక విలువలను సమర్థించే సామాజిక ప్రజాస్వామ్య-వాణి గల బ‌ల‌మైన‌ పార్టీగా ఉండాలి. ఆర్థిక కోణంలో, సామాజిక మార్పులను పార్టీ అర్థం చేసుకోగ‌లిగేలా ఉండాలి.

"పార్టీ కోసం అంద‌రూ.. అంద‌రి కోసం పార్టీ" అంటూ పార్టీని అంద‌రి పార్టీగా చేయాల‌న్న‌దే భారత్ జోడో యాత్ర వెనుక ఉన్న ఆలోచన. అణగారిన వర్గాలు, కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, రోజువారీ కూలీలు, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. కానీ పార్టీ సందేశం ఇంకా అస్పష్టంగానే ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల్లోకి కొత్త అధ్య‌క్షుడు బ‌ల‌మైన సందేశం పంపాల్సిన అవ‌స‌రం ఉంది.

కేంద్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా విమర్శించడమే కాకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక నమూనాను ముందుకు తీసుకురావాల్సిన ఉంది. పదే పదే ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న ఉత్తర భారతంలో ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు రావాలి.

అగ్ని ప‌రీక్ష‌గా ఎన్నిక‌లు

అన్నింటికంటే ముందుగా క‌ర్ణాట‌క లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు ఖ‌ర్గేకు ప్ర‌ధాన‌ప‌రీక్ష‌. గుజరాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో ఎన్నిక‌లు జ‌రిగినా ఆయ‌న‌కు త‌గిన స‌మ‌యం లేదు కాబ‌ట్టి పెద్ద లెక్క‌లోకి రాదు. కానీ 2024 లోక్ స‌భ ఎన్నిక‌లు ముందు 11 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.వీటిని స‌మ‌ర్ధంగా ఎదుర్కొని మెజారిటీ రాష్ట్రాల‌లో అధికారంలోకి తీసుకురావాల్సి ఉంటుంది.

సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌లు

అలాగే పార్టీలో సంస్క‌ర‌ణ‌ల‌కు నిర్ణ‌యాలు తీసుకోవాలి. సిడ‌బ్ల్యుసి కి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాలా అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సిడ‌బ్ల్యుసికి ఎన్నిక, పార్లమెంటరీ బోర్డు యంత్రాంగాన్ని పునరుద్ధరించడం, లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్లను నిర్ణయించే నిజమైన కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం జి-23 గ్రూప్ యొక్క ముఖ్య డిమాండ్లుగా ఉన్నాయి, దీని నాయకులు కూడా ఖర్గేకు మద్దతు ఇచ్చారు. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి. సిడ‌బ్ల్యుసి కి చివరిసారిగా 1997లో, అంతకు ముందు 1992లో ఎన్నికలు జరిగాయి, రెండు సందర్భాలలో గాంధీయేతర వ్యక్తే అధ్యక్షుడిగా ఉన్నారు.

త‌రాల మ‌ధ్య అంత‌రాలు

పార్టీలో త‌రాల అంత‌రాల‌ను త‌గ్గించ‌డం మ‌రో పెద్ద స‌వాల్‌. యువకులు,వృద్ధుల మధ్య అంతరాన్ని తగ్గించడం ఖర్గే ముందున్న ప్రధాన సవాలు. అధిష్టానం అభ్యర్థిగా ఖర్గే ని భావించ‌డం వ‌ల్లే అన్ని వయసుల నాయకులు ఆయనకు మద్దతు పలికారు. కానీ యువ నాయకులు, అనుభవజ్ఞుల మధ్య చీలిక చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ గొడవ అందరికీ తెలిసిందే. కేరళ, తెలంగాణ, గోవా, ఢిల్లీ, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఇలాంటి గొడవలు క‌నబడతాయి. ఖ‌ర్గేకు ఇది ఒక‌ర‌కంగా ముళ్ళ కిరీటంలాంటి ప‌ద‌వే. మ‌రి ఆయ‌న ఎలా ఇన్ని స‌వాళ్ళ‌ను నెగ్గుకు రాగ‌లుగుతారో ముందు ముందు తెలుస్తుంది.

First Published:  19 Oct 2022 12:30 PM GMT
Next Story