Telugu Global
National

భారతదేశంలో హిట్లర్ల‌కు స్థానం లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

మనం ప్రపంచం మొత్తాన్ని వసుధైక‌ కుటుంబంగా భావిస్తాము అందుకే ఇక్కడ హిట్లర్లకు స్థానం లేదు అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశంలో హిట్లర్ల‌కు స్థానం లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
X

భారతీయ జాతీయవాద భావన 'వసుధైక‌ కుటుంబం' ఆలోచనను ముందుకు తీసుకువెళుతుంది. ఏ దేశానికీ ఎటువంటి ముప్పు కలిగించదు, కాబట్టి భారతదేశంలో హిట్లర్ల‌కు స్థానం లేదు అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

న్యూఢిల్లీలో సంకల్ప్ ఫౌండేషన్, మాజీ బ్యూరోక్రాట్ల బృందం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...

"మన జాతీయవాదం ఇతరులకు ఎలాంటి ముప్పును కలిగించదు.. అది మన స్వభావం కాదు. మన జాతీయవాదం ప్రపంచం ఒకే కుటుంబమని (వసుధైక‌ కుటుంబం) చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఈ భావనను మరింతగా పెంపొందిస్తుంది. భారతదేశంలో ఎవరైనా హిట్లర్‌గా ఉండాలనుకుంటే దేశ ప్రజలు వారిని అలా ఉండనివ్వరు" అని మోహన్ భగవత్ అన్నారు

అందరూ ప్రపంచ మార్కెట్ గురించే మాట్లాడుతారని, కానీ భారతదేశం మాత్రం 'వసుధైక‌ కుటుంబం' గురించి మాట్లాడుతుందని, అంతే కాదు మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క జాతీయవాద భావన ఇతర‌ జాతీయవాద భావనల కన్నా భిన్నమైనదని, మిగతా జాతీయ వాదాలు మతం, భాష లేదా ప్రజల సాధారణ స్వప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.

ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క జాతీయవాద భావనలో భిన్నత్వం ఒక భాగమని, "మనకు సహజంగా వివిధ భాషలు,విభిన్నమైన దేవుడిని ఆరాధించే పద్ధతులున్నాయి " అని ఆయన అన్నారు.

"ఈ భూమి, ఆహారాన్ని, నీరును మాత్రమే కాదు, విలువలను కూడా ఇస్తుంది. అందుకే మేము దీనిని భారత మాత అని పిలుస్తాము." అని భగవత్ పేర్కొన్నారు.

First Published:  24 Sep 2022 2:01 PM GMT
Next Story