Telugu Global
National

ఊరంతా యూట్యూబర్లే.. విషయం తెలిసిన కలెక్టర్ ఏం చేశారంటే..

తుల్‌సీ గ్రామంలోని యూట్యూబర్లు ఏదో సరదాకు వీడియోలు చేసి పెట్టేరకం కాదు.. అందరూ దాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకొని వేలు, లక్షల్లో సంపాదిస్తున్నవారే.

ఊరంతా యూట్యూబర్లే.. విషయం తెలిసిన కలెక్టర్ ఏం చేశారంటే..
X

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరో ఒక యూట్యూబర్ మనకు కనిపిస్తుంటారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ఊరికి వెళ్తే మాత్రం మీకు అడుగడుగునా యూట్యూబర్లే దర్శనం ఇస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తుల్‌సీ అనే గ్రామానికి వెళ్తే మీకు చాలా మంది యూట్యూబర్లు కనపడతారు. 10వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో వీధికి ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు.

తుల్‌సీ గ్రామంలోని యూట్యూబర్లు ఏదో సరదాకు వీడియోలు చేసి పెట్టేరకం కాదు.. అందరూ దాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకొని వేలు, లక్షల్లో సంపాదిస్తున్నవారే. అయితే ఊరంతా యూట్యూబర్లు ఉన్న విషయం ఒక సహచరుడి ద్వారా తెలుసుకున్న రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరే వెంటనే ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎంతో మంది డిజిటల్ క్రియేటర్లు ఉండటం కలెక్టర్‌ను ఆశ్చర్యపరిచింది. ఎవరికి వారే చిన్న కెమేరాలు, మొబైల్ ఫోన్లను ఉపయోగించి యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేయడం గమనించారు. వారికి ఏదైనా సాయం చేయాలని తలపోశారు. వెంటనే రూ.25 లక్షల ఖర్చుతో అత్యాధునిక స్టూడియో నిర్మాణానికి ఓకే చేశారు.

తుల్‌సీ గ్రామంలోని ప్రతీ డిజిటల్ క్రియేటర్‌కు ఈ స్టూడియో ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఒక్కొక్కరికి ప్రతీ వీడియో కోసం అవుతున్న ఖర్చులో 40 శాతం ఈ స్టూడియో కారణంగా తగ్గిపోనున్నది. సెప్టెంబర్ 5న ఈ కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఇప్పుడు ఆ గ్రామంలోని యూట్యూబర్లు హాయిగా ఈ స్టూడియోలో తమ వీడియోలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

'ఈ గ్రామంలో ఇంత మంది యూట్యూబర్లు ఉండటం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక మంచి స్టూడియో ఉంటే వీరి సామర్థ్యం మరింతగా పెరుగుతుందని వీళ్లతో మాట్లాడినప్పుడు నాకు అర్థం అయ్యింది. వీళ్ల కోసం ఒక డిజిటల్ స్కిల్ సెంటర్‌ను కూడా మంజూరు చేశాము' అని కలెక్టర్ సర్వేశ్వర్ అన్నారు. స్కిల్ సెంటర్ మరో మూడు నెలల్లో రెడీ అవుతుంది. దీనికి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని రాయ్‌పూర్ జిల్లా పంచాయతి సీఈవో అభినాశ్ మిశ్రా తెలిపారు.

ఇప్పుడిప్పుడే యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు పెట్టాలనుకునే బిగినర్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తామని అభినాశ్ మిశ్రా తెలిపారు. కేవలం యూట్యూబ్ వీడియోల కోసమే కాకుండా ఆయా రంగాల్లో స్వయం ఉపాధి పొందడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు.

తుల్‌సీ గ్రామం అనగానే రాష్ట్రంలో అందరికీ దీపావళి సమయంలో ప్రదర్శించే రామ్‌లీలానే గుర్తుకు వస్తుంది. ఈ పౌరాణిక నాటకాన్ని ప్రతీ ఏటా ప్రదర్శించడం మాకు ఆనవాయితీగా మారిపోయిందని గ్రామ సర్పంచ్ గులాబ్ సింగ్ యాదు అన్నారు. దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి గ్రామానికి చెందిన కొంత మంది ఈ రామ్‌లీలాను ప్రదర్శిస్తున్నారు. వారి తాతలు, తండ్రుల నుంచి వారసత్వాన్ని అందుకున్న ప్రస్తుత తరం.. అదే రామ్‌లీలాను యూట్యూబ్‌ వీడియోలు చేసి విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు. ఈ యూట్యూబర్లలో ఎంతో టాలెంట్ ఉందని ఆయన ప్రశంసించారు.

ఊరి మధ్యలో'హమార్ ఫ్లిక్స్' పేరుతో నెలకొల్పిన స్టూడియోను ఉపయోగించుకొని ఎంతో మంది క్రియేటర్లు తమ వీడియోలను రూపొందిస్తున్నారు. ఈ స్టూడియో ద్వారా పాటలు, రీల్స్ చేయడమే కాకుండా.. ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలు కూడా రూపొందించాలని అధికారులు సూచిస్తున్నారు. 10వేల జనాభా ఉన్న తుల్‌సీ గ్రామం నుంచి ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అయితే చాలా మందికి ఆ వీడియోలన్నీ ఒకే గ్రామంలో తయారయ్యాయనే విషయం తెలియదు.

నిరుడు ఒక న్యూస్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఒకే ఊరిలో 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని.. వాటన్నింటినీ స్థానికులే విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్పింది. అప్పుడే తుల్‌సీ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఆయా యూట్యూబ్ ఛానల్స్‌లో ఛత్తీస్‌గఢ్ మ్యూజిజ్, రామ్‌లీలా వంటివి మాత్రమే కాకుండా సెటైర్లు, కామెడీ, బాలీవుడ్ స్పూఫ్స్, షార్ట్ ఫిల్మ్స్‌ కూడా అప్‌లోడ్ చేస్తున్నారు.

కేశవ్ వైషవ్ అనే యువ లాయర్ కమ్ యాక్టర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ 'కే మ్యూజిక్'ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ ప్రాంతీయ సంగీతం, పాటలను అప్‌లోడ్ చేస్తారు. ఈ ఛానల్‌కు 57 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 3.2 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. ఒక మ్యూజిక్ వీడియో రూపొందించడానికి తాను దాదాపు రూ.15 వేల వరకు ఖర్చు చేస్తానని.. అదే వీడియో ద్వారా యూట్యూబ్ నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తుందని కేశవ్ వెల్లడించారు. ఇప్పుడు కలెక్టర్ ఏర్పాటు చేసిన స్టూడియో కారణంగా తనకు ఖర్చు రూ.5 వేల వరకు తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.

జై ప్రకాశ్ వర్మ అనే 30 ఏళ్ల పీజీ విద్యార్థి 'బీయింగ్ ఛత్తీస్‌గఢ్' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. తనే సొంతగా కంటెంట్ రాసుకొని షార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఈ ఛానల్‌కు 1.22 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 2.45 కోట్ల వ్యూస్ సాధించారు. ల్యాప్‌టాప్‌లో ఒక వీడియో ఎడిట్ చేయాలంటే గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు స్టూడియో కారణంగా చాలా వేగంగా వీడియోలు ఎడిట్ చేసుకుంటున్నామని జై ప్రకాశ్ చెప్పారు.

జ్ఞానేంద్ర శుక్లా అనే వ్యక్తి 'బీయింగ్ ఛత్తీస్‌గరియా' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. స్టూడియో కారణంగా గతంలో కంటే సగం సమయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ పూర్తవుతోందని చెప్పారు. అంతే కాకుండా స్థానికులకు ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, యాక్టింగ్, డైరెక్టింగ్‌లో ఉపాధిని కల్పిస్తోందని అన్నారు. అభిషేక్ వర్మ అనే యువకుడు ఆడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. 'గోల్డ్ సీజీ04' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా హిప్-హాప్, ర్యాప్, ఛత్తీస్‌గరీ, హిందీ పాటలను స్వయంగా రాసి వీడియో క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 6వేల మంది సబ్‌స్క్రైబర్లు, 45వేల వ్యూస్ వచ్చాయని చెప్పాడు. కేవలం 40 వీడియోలు మాత్రమే తాను అప్‌లోడ్ చేశానని చెప్పాడు.

తాను 2018లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఊర్లో అసలు ఇంటర్నెట్ సదుపాయమే లేదు. దగ్గరలోని రైల్వే స్టేషన్‌, కాలేజీలో ఉండే వైఫై ఉపయోగించి వీడియోలు అప్‌లోడ్ చేసే వాడినని అభిషేక్ వర్మ చెప్పారు. ఆ సమయంలో వీడియో ఎడిటింగ్‌కు గంటల కొద్దీ సమయం పట్టేదని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన స్టూడియో కారణంగా ఊత్సాహవంతులైన యూట్యూబర్లకు చాలా సౌకర్యంగా ఉందని చెప్పారు. దీని వల్ల వేలాది రూపాయల ఖర్చు మిగలిపోతోందని అన్నారు.

కొత్త స్టూడియో కారణంగా డబ్బు, సమయం చాలా ఆదా అవుతోందని మధు కోస్లే పేర్కొన్నారు. గతంలో తాను పాటలు రికార్డ్ చేయడానికి రాయ్‌పూర్ వెళ్లేవాడిని.. కానీ ఇప్పుడు సొంత ఊర్లోనే రికార్డింగ్ చేసుకుంటున్నానని చెప్పారు. మా తల్లిదండ్రుల లాగే తాను కూడా రామ్‌లీలాను ప్రదర్శించేవాడినని కే మ్యూజిక్‌కు చెందిన కేశవ్ చెప్పారు. ముంబై వెళ్లి తన కలలను సాకారం చేసుకోవాలని ఉండేది. కానీ డబ్బు లేక వెళ్లలేకపోయానని చెప్పాడు. కానీ యూట్యూబ్ నా కోరికను తీర్చింది. ఇప్పుడు ఈ స్టూడియో నా కలను మరో మెట్టు ఎక్కించిందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఏఏఎఫ్‌టీ అనే ప్రైవేట్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు జిల్లా పంచాయతి సీఈవో అభినాశ్ మిశ్రా తెలిపారు. ఈ యూనివర్సిటీ అనేక ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహిస్తోంది. ఇవి యూట్యూబర్లతో పాటు ఇతర రంగాల వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ల భాగస్వామ్యం ఓకే అయితే స్థానిక డిజిటల్ క్రియేటర్లకు మంచి కోర్సులు అందించే వీలుంటుందని చెప్పారు.

రాబోయే రోజుల్లో ఒక ఛత్తీస్‌గఢ్ కవితో పాడ్ కాస్ట్ కూడా నిర్వహించాలనే ఆలోచన ఉన్నది. అలాగే ఇదే రాష్ట్రానికి చెందిన ఒక మహిళ స్థానిక వంటలను యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తోంది. ఆమెను కూడా తుల్‌సీ లోని స్టూడియోను వాడుకోమని చెప్పామని మిశ్రా వెల్లడించారు.

First Published:  26 Sep 2023 6:37 AM GMT
Next Story