Telugu Global
National

మోదీ నిర్వాకం ఇది.. పేదల సొమ్ముతో పెద్దలకు సోకు..

పేదలకు ఉచిత పథకాలు అవసరమా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేట్లకు కోట్ల రూపాయలు హారతి కర్పూరంలో సమర్పించడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు డీఎంకే నేతలు.

మోదీ నిర్వాకం ఇది.. పేదల సొమ్ముతో పెద్దలకు సోకు..
X

పేదలను కొట్టి గద్దలకు పెడుతున్నారంటూ ఆ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉచిత పథకాలపై జరుగుతున్న చర్చ సందర్భంగా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా మోదీ నిర్వాకాన్ని గణాంకాలతో సహా సుప్రీంకోర్టుకి వివరించింది. పేదలకు ఉచిత పథకాలు అవసరమా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేట్లకు కోట్ల రూపాయలు హారతి కర్పూరంలో సమర్పించడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు డీఎంకే నేతలు. అదానీకి మోదీ చేసిన మేలుని ఏ కేటగిరీలో వేయాలని సూటిగా అడుగుతున్నారు.

ఎవడబ్బ సొమ్ము..

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అంటే 2014 - 2017 మధ్య కాలంలో కేవలం అదానీ గ్రూప్‌కి నరేంద్ర మోదీ ప్రభుత్వం 72 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. బ్యాంకులకు కట్టాల్సిన మొండి బకాయిల్ని ఒక్క కలం పోటుతో కొట్టేసింది. ఇక ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా కార్పొరేట్ల పట్ల అంతే ఉదారంగా ఉంటున్నాయి. 7.27 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ మొండి బకాయిలను ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మాఫీ చేశాయి. మరి ఇవే బ్యాంకులు రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయవు. ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తే కేంద్రానికి ఎందుకంత కడుపు మంట. ఇతర వ్యవస్థలకు ఎందుకు అది తప్పుగా కనిపిస్తుందని అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

రైతులు కావాలా, రాబందులు కావాలా..?

అదానీ వ్యాపారం అంతా అప్పులపైనే జరుగుతోందని ఇటీవలే వార్తలొచ్చాయి. అలా అప్పులు చేసి మరీ బీజేపీ కోసం ఆయన టీవీ ఛానెళ్లలో లోపాయికారీగా వాటాలు కొనడం మొదలుపెట్టారు. గతంలో 72వేల కోట్ల రూపాయల మాఫీ వంటి ప్రయోజనాన్ని తనకు కలిగించినందుకే ఇప్పుడిలా టీవీ ఛానెళ్లు కొంటూ.. వాటిలో బీజేపీకి బాకాలూదే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కార్పొరేట్లకు చేసిన సాయం కంటే.. గత 11 ఏళ్లలో రాష్ట్రాలన్నీ కలిపి ఉచితాలకు ఖర్చు పెట్టిన సొమ్ము చాలా తక్కువ. మహా అయితే దాంట్లో సగం కూడా కాదు. 11 ఏళ్ల కాలంలో రైతు రుణమాఫీ కోసం 3.12 లక్షల కోట్లను ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. కార్పొరేట్ల రుణాలు ఎక్కువ, మాఫీలు ఎక్కువ. రైతుల రుణాలు తక్కువ, మాఫీలు కూడా తక్కువే. కేవలం ఎగవేసేందుకే కార్పొరేట్లు రుణాలు తీసుకుంటారు. తీసుకున్న రుణాలు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఒక్క కార్పొరేట్ అధినేత కూడా మనకి కనపడరు. కానీ దేశంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతుల మరణాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి.

ఉచితాల చర్చ మెల్లగా ఇప్పుడు కార్పొరేట్ రుణ మాఫీల వైపు మళ్లింది. కార్పొరేట్ కంపెనీల అధిపతులకు మేలు చేకూర్చేలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆఖరికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వారికి వత్తాసు పలకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

First Published:  27 Aug 2022 7:47 AM GMT
Next Story