Telugu Global
National

ఇండియాలో బీబీసీపై నిషేధం విధించాలన్న‌ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల్లో, "రిట్ పిటిషన్ లో ఏ విధమైన‌ మెరిట్ లేదు అందువల్ల‌ కొట్టివేస్తున్నాం" అని బెంచ్ పేర్కొంది.

ఇండియాలో బీబీసీపై నిషేధం విధించాలన్న‌ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
X

భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ అనే రైతు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం 'పూర్తిగా తప్పుడు పిటిషన్ గా భావిస్తున్నాం' అని పేర్కొంది.

ఈ మేరకు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. "రిట్ పిటిషన్ లో ఏ విధమైన‌ మెరిట్ లేదు అందువల్ల‌ కొట్టివేస్తున్నాం" అని బెంచ్ పేర్కొంది.

భారతదేశం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా BBC పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ "ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిస్టలు పొందుతున్న‌భారతదేశం, ప్రధానమంత్రి ఎదుగుదలకు వ్యతిరేకంగా జరిగిన లోతైన కుట్ర ఫలితం" అని పిటిషన్ ఆరోపించింది.

"2002 గుజరాత్ హింసాకాండకు సంబంధించి బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం, ప్రధాని నరేంద్ర మోడీని ఇరికించి, ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి నరేంద్ర మోడీ వ్యతిరేక ప్రచారాన్ని చేయ‌డమే కాకుండా, భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయడానికి బిబిసి చేసిన హిందూత్వ వ్యతిరేక ప్రచారం. " అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరో వైపు, డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రం, ఇతరుల నుండి ప్రతిస్పందనలను కోరింది.

సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కార్యకర్త లాయర్ ప్రశాంత్ భూషణ్, న్యాయవాది ఎంఎల్ శర్మలు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

First Published:  10 Feb 2023 10:44 AM GMT
Next Story