Telugu Global
National

ప్ర‌భుత్వాల్నే కూల్చేసిన ఉల్లిగ‌డ్డ‌.. నేత‌లూ జ‌ర జాగ్ర‌త్త‌!

నిత్యావ‌స‌ర వ‌స్తువైన ఉల్లి ధ‌ర అడ్డ‌గోలుగా పెరిగితే దాని ఘాటుకు ప్ర‌భుత్వాలే కూలిపోయిన సంద‌ర్భాలు మ‌న‌దేశంలో ఉన్నాయి.

ప్ర‌భుత్వాల్నే కూల్చేసిన ఉల్లిగ‌డ్డ‌.. నేత‌లూ జ‌ర జాగ్ర‌త్త‌!
X

ఉల్లి ధ‌ర అమాంతం పెర‌గ‌డంతో వినియోగ‌దారుడి క‌ళ్ల‌ల్లో నీళ్లొస్తున్నాయి. అయితే ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో ఈ ధ‌ర‌ల మంట చ‌ల్లార్చ‌క‌పోతే రాజ‌కీయ నేత‌లు క‌న్నీళ్లు పెట్టుకోవాల్సి వ‌స్తుంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందునా నిత్యావ‌స‌ర వ‌స్తువైన ఉల్లి ధ‌ర అడ్డ‌గోలుగా పెరిగితే దాని ఘాటుకు ప్ర‌భుత్వాలే కూలిపోయిన సంద‌ర్భాలు మ‌న‌దేశంలో ఉన్నాయి. కాబ‌ట్టి ఎన్నిక‌ల వేళ నేత‌లూ పారాహుషార్.

ఆ బాధేంటో ఢిల్లీ బీజేపీని అడ‌గండి

ఆఫ్ట్రాల్ ఉల్లిపాయ దెబ్బ‌కు ప్ర‌భుత్వం కూలిపోవ‌డం అంటే ఏంటో ఢిల్లీ బీజేపీని అడిగితే చెబుతుంది. 1998లో ఇప్ప‌టిలాగే ఉల్లి ధ‌ర‌లు ఎగిసిప‌డ్డాయి. కిలో రూపాయిన్న‌ర రెండు రూపాయ‌లు అమ్మే ఆ కాలంలో ఒక్క‌సారిగా 30 రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర ఎగ‌బాకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఉల్లి మంట‌లు ప్ర‌జ్వ‌రిల్లాయి. 1993 ఎన్నిక‌ల్లో 70 సీట్ల‌కు గాను 43 సీట్లు గెలిచి అధికారం చేప‌ట్టిన బీజేపీ 1998 ఎన్నిక‌ల్లో ఇత‌ర కార‌ణాల‌తో పాటు ఉల్లి ధ‌ర‌ల మంట‌ల‌కూ బ‌లైంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ఉల్లి ధ‌ర‌ల‌ను కంట్రోల్ చేయ‌డంలో బీజేపీ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్న పేద‌, మ‌ధ్య‌తర‌గ‌తి వ‌ర్గాల ఆగ్ర‌హ జ్వాల‌లో క‌మ‌లం క‌మిలిపోయింది. కేవ‌లం 15 సీట్లే తెచ్చుకుని ఘోర ప‌రాజ‌యం పాలైంది.

అప్ప‌టి నుంచి మళ్లీ అధికారం ద‌క్క‌లే

1998లో ఓడిపోయిన త‌ర్వాత బీజేపీకి మ‌ళ్లీ ఈ రోజుకూ అధికార పీఠం ద‌క్క‌లేదు. కొన్నాళ్లు కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ హ‌స్తిన‌ను ఏలుతున్నాయి. రెండు ప‌ర్యాయాలుగా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వ‌స్తున్నా.. ఢిల్లీ మాత్రం ద‌క్క‌డం లేదు. మ‌ళ్లీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉల్లి ధర‌లు కిలో రూ.60, 70కి వ‌చ్చేశాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కేంద్రంలోని బీజేపీకి ఇప్పుడు ఈ ధ‌ర‌ల మంటను చ‌ల్చార్చ‌డం స‌వాలే. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా స‌బ్సిడీలు ఇచ్చి వినియోగ‌దారుడికి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌క‌పోతే ఎన్నిక‌ల మీద ప్ర‌భావం చూపే ప్ర‌మాదం పొంచి ఉంది.

First Published:  28 Oct 2023 8:46 AM GMT
Next Story