Telugu Global
National

`తాగి డ్రైవింగ్ చేయను` అని మందు బాబులతో 1000 సార్లు రాయించిన పోలీసులు

కోర్టు ఆదేశాలతో పోలీసులు సోమవారం నుంచి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ మందుబాబులతో ఇకపై మద్యం తాగి డ్రైవింగ్ చేయను.. అని 1000 సార్లు రాయిస్తున్నారు.

`తాగి డ్రైవింగ్ చేయను` అని మందు బాబులతో 1000 సార్లు రాయించిన పోలీసులు
X

పాఠశాలలో విద్యార్థులు ఒక పదాన్ని పదేపదే తప్పు రాస్తున్నప్పుడు మరోసారి ఆ తప్పు చేయకుండా ఉపాధ్యాయులు ఆ పదాన్ని పదిసార్లో, వందసార్లో విద్యార్థులతో రాయిస్తుంటారు. ఆ తరహాలో మందు బాబులు కూడా తాగి రోడ్డుపై డ్రైవింగ్ చేయకుండా కేరళ పోలీసులు వారికి వింత శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడ్డ వారందరినీ ఒకచోటకు తెచ్చిన పోలీసులు వారితో ఇకపై 'మందు తాగి డ్రైవింగ్ చెయ్యను' అని 1000 సార్లు రాయించారు.

ఆదివారం కొచ్చిలో ఒక ప్రైవేట్ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. తాగి వాహనాలు నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకున్న హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి తాగి వాహనాల నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో పోలీసులు సోమవారం నుంచి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ మందుబాబులతో ఇకపై మద్యం తాగి డ్రైవింగ్ చేయను.. అని 1000 సార్లు రాయిస్తున్నారు. అయితే ఈ వింత శిక్ష విధించిన తర్వాత మందు బాబులను పోలీసులు వదిలిపెడతారనుకుంటే పొరపాటే. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First Published:  14 Feb 2023 5:25 AM GMT
Next Story