Telugu Global
National

పార్ల‌మెంటు వేదిక‌గా కేంద్రం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు విప‌క్షాలు స‌న్న‌ద్ధం!

భారత్-చైనా సరిహద్దు వివాదం, రాజ్యాంగ సంస్థలలో ప్రభుత్వ జోక్యంతో పాటు ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్‌టీ వంటి ప్ర‌దాన సమస్యలపై పార్ల‌మెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సిద్దమవుతున్నది.

పార్ల‌మెంటు వేదిక‌గా కేంద్రం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు విప‌క్షాలు స‌న్న‌ద్ధం!
X

బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల స‌మావేశాల్లో అధికార ప‌క్షాన్ని స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసేందుకు విప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. కేంద్రం రాష్ట్రాల ప‌ట్ల ముఖ్యంగా తెలంగాణ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న అనుచిత వైఖ‌రిపై అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై టిఆర్ ఎస్ ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రై బిజెపి ప్రభుత్వ కుటిల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల‌ని టిఆర్ ఎస్ నిర్ణ‌యించింది.

ప్రతిపక్షాలు చేసే ధర్నాలకు అంశాల వారీగా మద్ధతివ్వాలని నిర్ణ‌యించారు. అలాగే, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాల‌ను మార్చుకుంటూ దాడిని ఉద్ధృతం చేయాల‌నుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్ర‌బుత్వం, కేంద్రం మధ్య.. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదాలు నడుస్తున్నాయి. ఇదే సంద‌ర్భంలో టీఆర్ఎస్ మంత్రుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ సంఘ‌ట‌న‌ల‌ను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. పార్లమెంటు వేదికగా.. బీజేపీపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వీలైనంతగా బీజేపీని ఇరుకున పెట్టాల‌ని టీఆర్ఎస్. యోచిస్తోంది.

ఏపీ నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పార్లమెంటు వేదికగా అధికార వైసిపి ల‌క్ష్యంగా దాడి చేసేలా సిద్ధ‌మ‌వుతోంది. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గ‌ళాన్ని వినిపించేలా వ్య‌హ రచన చేస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉన్నందున అక్క‌డే పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం నిర్వ‌హించి సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి.. అవినీతికి పాల్పడుతోందనే విషయం కేంద్రం దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెడుతున్నార‌ని కేంద్రానికి తెలియ‌జేయాలని నిర్ణ‌యించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విష‌యంలో చ‌ర్యలు తీసుకునేలా డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారనీ. పార్లమెంటు వేదిక‌గా ఈ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటి రుణాలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారనీ. పార్లమెంటులో చర్చించడం మాత్రమే కాదు- వీటన్నిటిపై త‌మ‌ పోరాటం కొనసాగుతుందని టిడిపి నేత‌లు అంటున్నారు. రాష్ట్ర హోదా కోసం తాము రాజీనామాలు చేయడానికైనా సిద్ధమేననీ. రాష్ట్రాభివృద్ధి కోసం తామెలాంటి త్యాగాలు చేయడానికైనా ముందుకొస్తామనీ. రాజీనామా డిమాండ్ చేసిన జగన్ ఎక్కడున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ప్రశ్నించారు .

ఇక ప్రధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఈ స‌మావేశాలు స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌తీ చిన్న విష‌యానిక స‌భ‌ను అడ్డుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ది. అయితే భారత్-చైనా సరిహద్దు వివాదం, రాజ్యాంగ సంస్థలలో ప్రభుత్వ జోక్యంతో పాటు ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్‌టీ వంటి ప్ర‌దాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సిద్దమవుతున్నది.

కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి.

First Published:  6 Dec 2022 10:49 AM GMT
Next Story