Telugu Global
National

గుజరాత్ లో కేబుల్ వంతెన ప్ర‌మాదానికి అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం..ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి పోయి అనేకమంది మరణించడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ దుర్ఘ‌ట‌న నుంచి తృటిలో త‌ప్పుకున్న ప్ర‌త్య‌క్ష సాక్షులు త‌మ అనుభ‌వాల‌ను మీడియాతో పంచుకున్నారు.

గుజరాత్ లో కేబుల్ వంతెన ప్ర‌మాదానికి అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం..ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం
X

ఆదివారంనాడు గుజ‌రాత్ లోని మోర్బీ లో కేబుల్ వంతెన కూలిన ఘ‌ట‌న‌కు అధికారులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం, నిర్వ‌హ‌ణా లోప‌మే కార‌ణ‌మ‌ని అందువ‌ల్ల‌నే వంద‌లాది మంది మ‌ర‌ణించార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ దుర్ఘ‌ట‌న‌తో ఆ ప్రాంత‌మంతా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌వారు త‌మ వారికోసం రోద‌న‌ల‌తో వెతుకులాడుతుండ‌డం హృద‌యాల‌ను క‌లిచివేస్తోంది. ఈ దుర్ఘ‌ట‌న నుంచి తృటిలో త‌ప్పుకున్న ప్ర‌త్య‌క్ష సాక్షులు భ‌యంతో త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఆ సంఘ‌ట‌న త‌లుచుకుని వారు ఇప్ప‌టికీ భ‌యంతో వ‌ణికి పోతున్నారు.

ఈ దుర్ఘ‌ట‌న‌లో సిబ్బంది నిర్ల‌క్ష్యం, ఆదాయంపై ఆపేక్ష ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోందని, సంద‌ర్శ‌కులు సిబ్బందిని హెచ్చ‌రించిన‌ప్ప‌ట‌కీ సంద‌ర్శ‌కుల‌ను నియంత్రించ‌డంలో శ్ర‌ద్ధ వ‌హించ‌లేద‌ని, టిక్కెట్ల అమ్మకాల పైనే దృష్టి సారించార‌ని ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ప్ర‌త్య‌క్ష సాక్షి గోస్వామికుటుంబం చెబుతోంది.

అహ్మదాబాద్ కు చెందిన విజయ్ గోస్వామి త‌న కుటుంబ సభ్యులతో క‌లిసి ఆదివారం మధ్యాహ్నం మోర్బీలోని సస్పెన్షన్ వంతెనను సందర్శించేందుకు వెళ్ళారు. వంతెన‌పై భారీ జ‌న సందోహం ఉంది. వారిలో కొంద‌రు యువ‌కులు కావాల‌నే వంతెన‌పై గెంతుతూ అటూ ఇటూ ఊప‌డంతో త‌మ‌కు భ‌యంవేసింద‌ని గోస్వామి చెప్పారు. వారి చ‌ర్య‌లు, వంతెన ప‌రిస్థితిపై త‌న‌కు అనుమానం వ‌చ్చి భ‌యంతో ముందుకు క‌ద‌ల‌కుండా భ‌యంతో కుటుంబంతో స‌హా వెన‌క్కివ‌చ్చామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని బ్రిడ్జి వ‌ద్ద సిబ్బందికి చెప్పినా వారు ప‌ట్టించుకోలేద‌ని, నిర్ల‌క్ష్యంగా జ‌వాబిచ్చార‌ని గోస్వామి తెలిపారు.

" అక్క‌డి నుండి మేము బయలుదేరే ముందు, వంతెనను కదిలించకుండా ప్రజలను ఆపడానికి అక్క‌డ విధుల్లో ఉన్న సిబ్బందిని నేను అప్రమత్తం చేసాను. అయితే వారు టిక్కెట్ల విక్రయంపైనే ఆసక్తి చూపారు. అక్కడసలు రద్దీని నియంత్రించే వ్యవస్థే లేదని చెప్పారు. మేము బయలుదేరిన కొన్ని గంటల తర్వాత, చివ‌రికి వంతెన కూలిపోవడంతో మా భయాలు నిజమయ్యాయి, "అని ఆయ‌న చెప్పాడు.

వంతెన కూలిపోవడంతో తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కనిపించకుండా పోయారని సంఘ‌ట‌నా స్థ‌లంలో పలువురు చిన్నారులు విలేకరులతో చెప్పారు. "బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయినప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. నేను ఒక‌ తాడును పట్టుకుని నెమ్మదిగా పైకి లేచాను కాబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డాను. కానీ మా నాన్న, అమ్మ ఇప్పటికీ క‌న‌బ‌డ‌డంలేదు. " అని 10 ఏళ్ల బాలుడు చెప్పాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిలో ఉన్న మెహుల్ రావల్ మాట్లాడుతూ వంతెన కూలిపోయే సమయానికి వంతెనపై దాదాపు 300 మంది ఉన్నారని తెలిపారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న 1979 లో ముచ్చూ డ్యామ్ విషాదాన్ని త‌ల‌పిస్తోంద‌ని స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న స్థానికుడొక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముచ్చు ఆన‌క‌ట్టకు గండిప‌డిన సంద‌ర్భంలో వేలాది మంది మ‌ర‌ణించార‌ని, ఆ గాయాలు ఇప్ప‌టికీ మాన‌లేద‌ని అన్నారు.

First Published:  31 Oct 2022 7:45 AM GMT
Next Story