Telugu Global
National

సొమ్ము భారత‌ ప్రజలది, కరెంట్ బాంగ్లాదేశ్ కు, లాభాలు అదానీకి

ఇలాంటివి మనదేశంలో తప్ప మరెక్కడా జరగకపోవచ్చు. ఈ దేశ ప్రభుత్వ‌ సొమ్ముతో పవర్ ప్రాజెక్టు పెట్టి, ఆ పవర్ ను పక్క దేశానికి అమ్మి, లాభాలు మాత్రం అదానీ సంపాదిస్తున్నారు. మోడీ సర్కార్ అండతో ఇది సాధ్యమైంది.

సొమ్ము భారత‌ ప్రజలది, కరెంట్ బాంగ్లాదేశ్ కు, లాభాలు అదానీకి
X

మోడీ సర్కార్ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా అదానీ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. నాడు ఒక వ్యాపారవేత్తగా ఉన్న అదానీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశాన్నే శాసించే స్థాయికి ఎదిగాడు. కరోనా ప్రపంచాన్ని కాటువేస్తున్న వేళ.. అన్ని కంపెనీలు నష్టాల్లో కూరుకు పోతుంటే ఒక్క అదానీ ఆస్తులు మాత్రం వందల రెట్లు అమాంతం పెరిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3 వ స్థానంలో నిలిచాడు. ఇది ఇలా సాధ్యమైందో ఒక్క చిన్న ఉదాహరణ చూద్దాం.

జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో అదానీ గ్రూపు 1600 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకుంది. అదే సంవత్సరంలో ఈ పవర్ స్టేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ 100 శాతం బాంగ్లాదేశ్ కు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. విధ్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును 100 శాతం ఆస్ట్రేలియాలో ఉన్న అదానీ కంపెనీల నుంచి ఒడిశాలో ఉన్న అదానీ ధర్మ పోర్టు ద్వారా దిగుమతి చేసుకుంటుంది.

ఇంతవరకు బాగానే ఉంది. బొగ్గు అదానీదే.. పోర్టు అదానీదే. కానీ ప్రాజెక్టు నెలకొల్పడానికి 1.4 బిలియన్ యూఎస్ డాలర్లను అంటే ప్రాజెక్టు విలువలో 80 శాతం భారత ప్రభుత్వ ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ద్వారా పొందడం జరిగింది.

ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి అవసరమైన అన్ని అనుమతులతో పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద పరిగణిస్తూ.. అన్ని విధాలా పన్ను రాయితీలు, సబ్సిడీలను 2019లో ప్రకటించింది మోడీ సర్కార్ దేశంలో సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థల అధీనంలో ఉన్న బొగ్గు టన్ను 4 వేలకే లభిస్తుంటే ఆస్ట్రేలియా నుండి టన్ను 30 వేల చొప్పున బొగ్గు దిగుమతి చేసుకుంటూ భారీగా పెరిగిన ఉత్పత్తి ఖర్చును చూపించి అదే స్థాయిలో కేంద్రం నుండి రాయితీల రూపంలో లబ్ది పొందడం జరుగుతుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి సొమ్ము భారత ప్రజలది..పవర్ ఉత్పత్తి చేసి అమ్మేది పక్క దేశానికి, లాభాలు ఆర్జించేది మాత్రం అదానీ కంపెనీ. ఇదీ అదానీ నిర్భర్ భారత్ కథ.

First Published:  7 Sep 2022 8:42 AM GMT
Next Story