Telugu Global
National

ఇటు తమిళనాడును, అటు JNUను తాకిన 'ది కేరళ స్టోరీ' సెగ‌

ఈ మూవీని, ABVP JNUలో స్క్రీనింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు JNU క్యాంపస్ లో అతి పెద్ద ర్యాలీ నిర్వహించాయి. ఈ మూవీ సంఘ్ పరివార్ అబద్దాల ఫ్యాక్టరీలో తయారయ్యిందని వామపక్ష విద్యార్థులు ఆరోపించారు.

ఇటు తమిళనాడును, అటు JNUను తాకిన ది కేరళ స్టోరీ సెగ‌
X

వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' మూవీ కేరళ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా నిరసనలకు కారణమయ్యింది. ఈ మూవీలో మొత్తం అబ‌ద్దాలుప్రచారం చేస్తున్నారని, లేని విషయాలను ఉన్నట్టు చూపిస్తున్న ఈ మూవీ వెనక ఆరెస్సెస్ , బీజేపీ ఉన్నాయని వామపక్షాలు ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మూవీని వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజనులు కూడా ఈ మూవీపై విమర్శల వర్షం కురిస్తున్నారు.ఈ మూవీకి వ్యతిరేకంగా కేరళలో అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ మూవీ మీద వస్తున్న వ్యతిరేకతతో మూవీ యూనిట్ తమ మాట మార్చింది . మొన్నటి వరకు. కేరళలో 30 వేల మంది హిందూ యువతులు మాయమయ్యారని, వారంతా ఇస్లాం మతం పుచ్చుకొని ఐసిస్ లో చేరారని ఈ మూవీ యూనిట్ ప్రచారం చేసింది. ఇది కొంత కాలంగా ఆరెస్సెస్ , బీజేపీ చేస్తున్న ప్రచారమే. అయితే మూవీ యూనిట్ ఇప్పుడు మాట మార్చి ఇస్లాం పుచ్చుకొని, ఐసిస్ లో చేరిన యువతులు ముగ్గురే అనే ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఎవ్వరూ మాట్లాడనంత కాలం 30 వేలుగా ప్రచారం చేసిన చిత్ర బృందం సడెన్ గా దాన్ని మూడుగా చూపడం వెనక కారణాలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని బట్టే ఆ మూవీలో చూపిస్తున్నదంతా అబద్దమనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మూవీ సెగ తమిళనాడును కూడా తాకనుందని, 'ది కేరళ స్టోరీ'ని తమిళనాడు లో విడుదల కాకుండా చూడాలని ఆ రాష్ట్ర ఇంటలీజన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసిందనే వార్తలు వస్తున్నాయి.

తమిళనాడులో కనుక ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఖాయమంటూ నిఘా వర్గాలు తమిళనాడు పోలీసు శాఖను హెచ్చరించాయి. ఫలితంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. కాబట్టి ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడులో సినిమా విడుదల కాకుండా చూడాలని చెప్పింది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్ చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటారని పోలీసుల వర్గాలు తెలిపాయి.

మరో వైపు, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో బీజేపీ, ఆరెస్సెస్ అనుబంద సంఘం ABVP ‘ది కేరళ స్టోరీ’ స్క్రీనింగ్ చేసింది. ముందుగానే పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు.

మరో వైపు, ఈ మూవీని ABVP JNUలో స్క్రీనింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు JNU క్యాంపస్ లో అతి పెద్ద ర్యాలీ నిర్వహించాయి. ఈ మూవీ సంఘ్ పరివార్ అబద్దాల ఫ్యాక్టరీలో తయారయ్యిందని వామపక్ష విద్యార్థులు ఆరోపించారు. అబద్దాలతో నిండిన ఈ మూవీతో రాజకీయ లాభం గడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్ ఎఫ్ ఐ నాయకులు మండిపడ్డారు.

First Published:  4 May 2023 5:57 AM GMT
Next Story