Telugu Global
National

ఈ చిన్నారిని జైలుకు పంపండి ప్లీజ్...!

ఓ 6నెలల పసి పాపను జైలుకు పంపాలని వాళ్ళ అమ్మమ్మ అధికారులను వేడుకుంటోంది. ఆ పసిదాని తల్లి జైలులో ఉంది. తల్లి లేకుండా, తల్లి పాలు లేకుండా ఆ చిన్నారి బతకడమే కష్టంగా ఉందని ఆ వృద్దురాలు చెప్తోంది.

ఈ చిన్నారిని జైలుకు పంపండి ప్లీజ్...!
X

6 నెలల పసి పాపను ఎత్తుకొని ఓ వృద్దురాలు, ఆ పాపను జైలుకు పంపేందుకు సహకరించమంటూ గడప గడపకూ తిరుగుతోంది. పోలీసు స్టేషన్ చుట్టూ , అధికార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఎమ్మెల్యేను బతిమిలాడుకుంటోంది. గుండెలు ద్రవించే ఈ సంఘటన‌ ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం....


ఉత్తరప్రదేశ్, చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దశరా సందర్భంగా రాంలీలా జరిగింది. ఆ రాంలీలా చూడటానికి ఈ పసిపాప తల్లి పూజ కూడా వెళ్ళింది. రాంలీలా జరుగుతున్న సమయంలో ఒక యువతిపై ఇద్దరు పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అది చూసిన జనం ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయిన పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. 7గురిని అరెస్టు చేశారు. ఆ అరెస్టయిన వారిలో ఈ పసిపాప తల్లి పూజ కూడా ఉంది.

తల్లి జైలుకెళ్ళడంతో ఆ 6 నెలల పసి పాప అమ్మమ్మ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ పసిదాన్ని చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ లేరు. తన తల్లి పాలు లేక బిడ్డ ఆకలితో అలమిటిస్తోంది. తల్లి లేని ఆ అమాయకపు పసిది రోజంతా ఏడుస్తూనే ఉంటోంది. బాలికను రక్షించేందుకు, ఆమె అమ్మమ్మ ఆ పాపను తన తల్లి దగ్గరికి పంపాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. కానీ ఎవ్వరూ ఆమె గోడు వినిపించుకోవడంలేదు. నిన్న ఆ పసిబిడ్డ కుటుంబ సభ్యులు జిల్లా జైలు రగౌలికి వెళ్ళారు. బాలికను ఆమె తల్లి వద్దకు తీసుకెళ్లాలని జైలు అధికారులను అభ్యర్థించగా, జైలు అధికారులు కూడా కోర్టు ఆదేశాలు లేకుండా బిడ్డను తీసుకెళ్లడానికి నిరాకరించారు.

ఈ 6 నెలల చిన్నారిని జైలుకు పంపాలని ఆ పాప అమ్మమ్మ స్థానిక‌ ఎమ్మెల్యే అనిల్ ప్రధాన్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆయన కూడా చేతులెత్తేశారు.

అరెస్టై జైల్లో ఉన్న పూజకు 6 నెలల కూతురు ఉందనే విషయాన్ని పోలీసులు నమోదు చేయలేదని జైలు సూపరింటెండెంట్ అశోక్ సాగర్ అన్నారు. అందువల్ల తామేమీ చేయలేమని తెలిపారు. ఒక వేళ‌ కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ చిన్నారిని తల్లి వద్దే ఉంచుతామని చెప్పారాయన.

ఈ మొత్తం వ్యవహారంలో ఆ పసిబిడ్డ చేసిన తప్పేంటి అనే ప్రశ్న వస్తోంది. అమ్మ లేకుండా, అమ్మ పాలు లేకుండా ఆ పసిది బతకడ ఎలా ? ఈ 6నెలల పసి పాపపై అధికారులకు జాలి ఎందుకు కలగడం లేదు ? తల్లి లేకపోవడం వల్ల‌ ఆ పాప‌ పరిస్థితి మరింత దిగజారితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?

First Published:  5 Oct 2022 4:31 AM GMT
Next Story