Telugu Global
National

మైనారిటీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం

ఈ పథకాన్ని 2022-23 నుండి MOMA నిలిపివేసింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) గత నెలలో అన్ని బ్యాంకులకు నోటిఫికేషన్ ఇచ్చింది.మార్చి 31, 2022 నాటికి ఉన్న లబ్ధిదారులకు రుణం వడ్డీ రాయితీని కొనసాగిస్తారు. అయితే, ఈ పథకం ఎందుకు నిలిపివేయబడిందనే దానిపై బ్యాంకులు కారణాన్ని వెల్లడించలేదు

మైనారిటీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం
X

మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఇకపై విదేశాల్లో చదువుకోవడానికి విద్యా రుణాలపై వడ్డీ రాయితీలను పొందలేరు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOMA) 'పడో పరదేశ్' పథకాన్ని నిలిపివేసినట్లు ది హిందూ బిజినెస్‌లైన్ నివేదించింది.

2022-23 నుండి పథకాన్ని నిలిపివేస్తున్నట్టు గత నెలలో, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అన్ని బ్యాంకులకు తెలియజేసింది. అయితే దీనికి ఎటువంటి కారణం చెప్ప‌లేదు.

'పడో పరదేశ్' వడ్డీ రాయితీ పథకానికి, విదేశాలలో మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు చదవాలనుకునే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలతో సహా మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అర్హులు. కోర్సు అయిపోయిన సంవత్సరం తర్వాత కానీ ఉద్యోగం వచ్చిన 6 నెలల తర్వాత కానీ, ఏది ముందైతే దాని ఆధారంగా రుణ చెల్లింపులు, వడ్డీ రాయితీలు ఉంటాయి.

ఈ పథకం ప్రకారం, సంవత్సరానికి రూ. 6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న అభ్యర్థులు (ఉద్యోగులు, నిరుద్యోగులు ఇద్దరూ) మాత్రమే వడ్డీ రాయితీని పొందవచ్చు. పథకం కింద, 35% సీట్లు మహిళలకు కేటాయించబడ్డాయి. ఈ పథకం 2006లో మైనారిటీల సంక్షేమం కోసం అప్పటి ప్రధానమంత్రి పదిహేను అంశాల కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టారు.

ఇకపై సబ్సిడీలు లేవు

అయితే, బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం, ఈ పథకం కోసం నియమించబడిన నోడల్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ ద్వారా అమలు చేయబడుతున్న పథకాన్ని 2022-23 నుండి MOMA నిలిపివేసింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) గత నెలలో అన్ని బ్యాంకులకు నోటిఫికేషన్ ఇచ్చింది. వార్తా నివేదిక ప్రకారం, మార్చి 31, 2022 నాటికి ఉన్న లబ్ధిదారులకు రుణం వడ్డీ రాయితీని కొనసాగిస్తారు. అయితే, ఈ పథకం ఎందుకు నిలిపివేయబడిందనే దానిపై బ్యాంకులు కారణాన్ని వెల్లడించలేదని బిజినెస్‌లైన్ నివేదించింది.

మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ను MOMA నిలిపివేసిన కొద్ది రోజులకే కేంద్ర ఇప్పుడు ఈ చర్య తీసుకుంది.

First Published:  16 Jan 2023 2:09 AM GMT
Next Story