Telugu Global
National

మోదీ రిబ్బన్ కట్.. ఆరో రోజే రిపేర్ వర్క్..

బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేని ప్ర‌ధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించడం, అంతలోనే వర్షాలకు గుంతలు తేలడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

మోదీ రిబ్బన్ కట్.. ఆరో రోజే రిపేర్ వర్క్..
X

జులై 16న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే వారం రోజుల్లోనే వర్షాలకు కొట్టుకుపోయింది. వర్షాలకు కొత్త హైవే తీవ్రంగా దెబ్బతిన్నది. రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే మరమ్మతులు జరిగేలోపే సేలంపూర్ సమీపంలోని చిరియా వద్ద రెండు కార్లు, ఓ బైక్ ప్రమాదానికి గురయ్యాయి. ఔరయాలోని అజిత్మల్ దగ్గర కూడా రోడ్డు గుంతలు తేలి కనిపిస్తోంది. అట్టహాసంగా మోదీ ఈ ఎక్స్ ప్రెస్ వే ని ప్రారంభించడం, అంతలోనే వర్షాలకు గుంతలు తేలడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

296 కిలోమీటర్ల నాలుగు లైన్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని 7 జిల్లాల నుంచి వెళ్తుంది. చిత్రకూట్‌ లోని భరత్‌ కూప్‌ నుంచి ఇటావాలోని కుద్రేల్‌ వరకు ఈ రోడ్డు వేశారు. 8 వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇది. ఆరు లైన్లకు విస్తరించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేగా తీర్చిదిద్దారు. ఈనెల 16న దీన్ని మోదీ ప్రారంభించారు.

ప్రచార ఆర్భాటమేనా..?

బుందేల్ ఖండ్ హైవే ప్రారంభోత్సవానికి మోదీ హాజరుకావడంతో దేశవ్యాప్తంగా ఈ ఎక్స్ ప్రెస్ హైవే వార్తల్లోకెక్కింది. అయితే ఆరు రోజుల్లోనే మరోసారి బండారం మొత్తం బయటపడింది. రోడ్డు నాణ్యతను పట్టించుకోలేదని, కాంట్రాక్టర్ల కక్కుర్తితో ఈ రోడ్డు ఇలా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మోదీ ప్రచారం కోసం హడావిడిగా పనులు చేసి కోట్ల రూపాయలను బూడిదలో పోసిన పన్నీరులా చేశారని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. సోషల్ మీడియాలో కూడా బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ నేతలు కవర్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా వారు స్పందించలేదు.

First Published:  22 July 2022 11:58 AM GMT
Next Story