Telugu Global
National

తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో

ఇప్పుడు విజయ్ ఈ వేదికనే రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గత గురువారం 'మక్కల్ ఇయక్కమ్' నిర్వాహకులతో విజయ్ సమావేశం అయ్యారు.

తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో
X

తమిళనాడు రాష్ట్రంలో మొదటి నుంచి సినీ నేపథ్యం ఉన్నవారు రాజకీయరంగంలోనూ రాణిస్తున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలకు సినీ నేపథ్యం ఉంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారు. దళపతి విజయ్ కొత్త పార్టీ పెడుతూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి గత ఎన్నికలకు ముందే విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ విజయ్ ఎందుకో ముందడుగు వేయలేదు.

కానీ, ఇప్పుడు మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ 'మక్కల్ ఇయక్కమ్' అనే వేదిక ఏర్పాటు చేసి విజయ్ అభిమానులతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల కిందట తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వేదిక తరఫున విజయ్ అభిమానులు పోటీ చేసి కొన్నిచోట్ల విజయం కూడా సాధించారు.

ఇప్పుడు విజయ్ ఈ వేదికనే రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గత గురువారం 'మక్కల్ ఇయక్కమ్' నిర్వాహకులతో విజయ్ సమావేశం అయ్యారు. పార్టీ ఏర్పాటుపై అభిమానులతో చర్చించారు. వచ్చేవారం విజయ్ ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు కోసం ఈసీని కలుస్తారనే టాక్ వినిపిస్తోంది.

అయితే వచ్చే లోక్ సభ ఎన్నికలకు కేవలం 3 నెలల గడువు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయ్ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కల్లా పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. డీఎంకేకు పోటీ ఇచ్చే నాయకులు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో కనిపించడం లేదు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్న విజయ్ అందుకోసం సిద్ధం అవుతున్నారు.

First Published:  27 Jan 2024 3:49 PM GMT
Next Story