Telugu Global
National

4జీ ధరలకే 5జీ సేవలు.. కారణం ఇదే

జియో, ఎయిర్‌టెల్, వీఐ సంస్థలు ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నాయి. అయితే దానికి తగినట్లుగా దేశంలో 5జీ సిగ్నల్‌ను అందుకునే హ్యండ్ సెట్లు తగినన్ని లేవనే వార్తలు వస్తున్నాయి.

4జీ ధరలకే 5జీ సేవలు.. కారణం ఇదే
X

దేశంలో ఇక 5జీ మొబైల్ సేవలు మొదలు కానున్నాయి. ఈ దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ జియో ఇప్పటికే ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా నెల రోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, 2023 చివరి కల్లా దేశంలోని అన్ని పట్టణాల్లో 5జీ నెట్‌వర్క్ ఉంటుందని చెప్పింది. ఇప్పటికే టెస్టింగ్ కూడా పూర్తిచేశారు. అన్ని టెలికాం కంపెనీలు 5జీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇప్పటికే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ టారిఫ్ ప్లాన్లు ఎలా ఉంటాయనే విషయంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

జియో, ఎయిర్‌టెల్, వీఐ సంస్థలు ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నాయి. అయితే దానికి తగినట్లుగా దేశంలో 5జీ సిగ్నల్‌ను అందుకునే హ్యండ్ సెట్లు తగినన్ని లేవనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో 5జీ పేరుతో విడుదల అవుతున్న స్మార్ట్ ఫోన్లు పూర్తిస్థాయిలో 5జీని సపోర్ట్ చేయడం లేదని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 5జీకి అనుమతి ఇచ్చిన స్పెక్ట్రమ్‌ను కొన్ని 5జీ ఎనేబుల్డ్ మొబైల్స్ డిటెక్ట్ చేయడం లేదని పరిశీలనలో తేలింది. ఈ సవాళ్లను అధిగమించాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. మరి అప్పుడే వినియోగదారులకు 5జీ సేవలు అందించి లాభమేంటనే ప్రశ్న కూడా వస్తోంది.

ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలో తొలుత 4జీ టారిఫ్ ప్లాన్‌తోనే 5జీ సేవలను అందించాలని భావిస్తోంది. కొత్త ప్యాక్‌లకు బదులు ఇప్పుడున్న 4జీ టారిఫ్‌లనే 5జీ అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నాయి. దీని వల్ల సబ్‌స్క్రైబర్లు సిమ్ కార్డు మార్చకుండానే మరింత వేగంగా డేటా సేవలు అందుకోవచ్చు. టారిఫ్ ధరలు పెంచకుండా వినియోగదారులకు 5జీ సేవలను అలవాటు చేయవచ్చు. ఇక మార్కెట్లోకి పూర్తి స్థాయిలో 5జీ ఫోన్లు వచ్చిన తర్వాత ధరలు పెంచితే.. అప్పటికే అలవాటైన వినియోగదారులు ఆటోమెటిక్‌గా 5జీ టారిఫ్‌ను పెద్దగా పట్టించుకోరని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో 60 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉండగా.. అందులో 5జీ సపోర్ట్ చేసే ఫోన్లు 5 కోట్ల వరకు మాత్రమే ఉంటాయి. ఆ 5జీ ఫోన్లు కూడా పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాలేక పోతున్నాయని ఇటీవల కౌంటర్ పాయింట్ అనే సంస్థ సర్వేలో తేలింది. 5జీ నెట్‌వర్క్ వచ్చాకే.. ఆ ఫోన్లు కొందాంలే అని ఆగిన వినియోగదారులు కూడా ఉన్నారు. కాబట్టి రాబోయే ఆరు నెలల్లో 5జీ ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయని.. దాదాపు 10 కోట్ల హ్యాండ్ సెట్లు అమ్మే అవకాశం ఉంటుందని తేలింది. అందుకే టెలికాం సంస్థలు 4జీ ధరలకే తొలుత 5జీ సేవలు ఇచ్చి.. ఆ తర్వాత టారిఫ్ ప్లాన్లను మార్చేందుకు వ్యూహం రచించాయి.

First Published:  8 Sep 2022 1:11 PM GMT
Next Story