Telugu Global
National

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం? జనవరిలో మినీ జమిలీ ఎన్నికలా?

షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్-డిసెంబర్‌లో నిర్వహించాల్సి ఉన్నది. ఇక పార్లమెంటుతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీలకు జూన్‌లో గడువు తీరుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం? జనవరిలో మినీ జమిలీ ఎన్నికలా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు నెలల పాటు ఆలస్యం కానున్నాయా? జనవరిలో మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ చేస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మినీ జమిలీ ఎన్నికలకు బలం చేకూరుస్తోంది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి లోబడే మినీ జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి పార్లమెంటు, చట్ట సభల గడువు తీరడానికి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహిచడానికి అధికారం ఉందని గురువారం భోపాల్‌లో స్పష్టం చేశారు.

షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్-డిసెంబర్‌లో నిర్వహించాల్సి ఉన్నది. ఇక పార్లమెంట్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీలకు జూన్‌లో గడువు తీరుతుంది. చట్ట సభల గడువు తీరడానికి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించడానికి తమకు అధికారం ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంటే లోక్‌సభతో పాటు ఆయా రాష్ట్రాలకు జనవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. తెలంగాణ, రాజస్థాన్, మీజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలను రెండు నెలల ఆలస్యం చేస్తే.. ఏకంగా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నది.

ఇక వచ్చే ఏడాది గడువు ముగియనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. అసెంబ్లీ ఎన్నికల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క జార్ఖండ్ తప్ప మిగిలిన వాటిలో బీజేపీ, మిత్ర పక్షాలే అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు ముందస్తుకు వెళ్లడానికి పెద్దగా అభ్యంతరం కూడా ఉండదు. ఈ విధంగా అంచనా వేస్తే 12 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు, పార్లమెంటు ఎన్నికలు కూడా కలిపితే ఒక మినీ జమిలీ ఎన్నికలే అవుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాగే ఆలోచిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి.

జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమ అసెంబ్లీలను రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేవు. ఇదే సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీలను రద్దు చేసి ముందస్తు అనే మాటే లేకుండా.. తమకు ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో బీజేపీ కనీసం మినీ జమిలీ ఎన్నికలను అయినా నిర్వహించి లబ్దిపొందాలని భావిస్తోందని చర్చ జరుగుతున్నది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.

First Published:  7 Sep 2023 11:52 PM GMT
Next Story