Telugu Global
National

రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్ తో పట్టుబడిన తెలంగాణ టీచర్

100 కోట్ల విలువైన నిషిద్ధ హెరాయిన్ ని తరలిస్తూ బెంగుళూరు విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన ఓ టీచర్ పట్టుబడ్డాడు. ఇథియోపియా నుంచి ఇక్కడికి చేరుకున్న అతని వద్ద 14 కేజీల హెరాయిన్ ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్ తో పట్టుబడిన తెలంగాణ టీచర్
X

తెలంగాణకు చెందిన ఓ టీచర్ డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు. తెలిసో, తెలియకో ఇథియోపియా లోని డ్రగ్స్ ముఠా వలలో పడ్డాడు. సుమారు 52 ఏళ్ళ ఈ టీచర్ .. రెండు ట్రాలీ బ్యాగుల్లో రూ. 100 కోట్ల విలువైన నిషిద్ధ హెరాయిన్ ని తరలిస్తూ బెంగుళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతని నుంచి 14 కేజీల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబా నుంచి ఇక్కడికి చేరుకున్న ఇతని వద్ద ఇన్నికేజీలహెరాయిన్ ని చూసి ఆశ్చర్యపోయామని, ఇది అతి పెద్ద డ్రగ్స్ కేసని వారు చెప్పారు. ఉద్యోగం కోసం ఆన్ లైన్ ద్వారా సెర్చ్ చేస్తున్న ఇతడ్ని.. ఆఫ్రికా లోని ఇథియోపియాలో అక్రమ డ్రగ్స్ రాకెట్... మాయమాటలు చెప్పి అక్కడికి రప్పించుకున్నట్టు తెలుస్తోంది. అడ్డిస్ అబాబా నుంచి ఓ మధ్యవయస్కుడు భారీ ఎత్తున హెరాయిన్ ని బెంగుళూరు ద్వారా ఢిల్లీకి స్మగుల్ చేయనున్నట్టు అందిన సమాచారంతో బెంగుళూరు డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఈ నెల 19 నుంచే వీరు నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేశారు. ఇథియోపియా నుంచి వచ్చే విమానం కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో .ఒకరు అనుమానాస్పదంగా కనబడడంతో.. అతని లగేజీని తనిఖీ చేయగా.. హెరాయిన్ పట్టుబడింది. తెలంగాణకు చెందిన టీచర్ గా ఇతడ్ని గుర్తించారు. విమానాశ్రయం లోని కంప్యూటర్ స్నాకర్ల నుంచి తప్పించుకునేందుకు ఇతగాడు రెండు ట్రాలీ బ్యాగుల్లో రహస్యంగా హెరాయిన్ దాచినట్టు వెల్లడైంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.

ఇతడ్ని ప్రశ్నించినప్పుడు.. తాను వృత్తి రీత్యా టీచర్ నని, పిల్లలకు ట్యూషన్ చెబుతుంటానని తెలిపాడట. కొన్ని నెలల క్రితం ఉద్యోగానికి సంబంధించి ఆన్ లైన్ లో ఓ ప్రకటన చూశానని.. విదేశాల్లో జాబ్ చేయాలనుకోగోరేవారు తమను సంప్రదించాలని అందులో ఓ నెంబర్ ఇచ్చారని ఆయన చెప్పాడట.. దీంతో ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేయగా.. అడ్డిస్ అబాబా లోని ఓ వ్యక్తి తనకు కాల్ చేసి అక్కడికి రావాలని కోరాడని వెల్లడించాడు. అక్కడికి వెళ్లిన తనతో డ్రగ్స్ ముఠా ఒకటి డీల్ కుదుర్చుకుందన్నాడు. బెంగుళూరు ద్వారా డ్రగ్స్ దొంగ రవాణా చేస్తున్న స్మగర్లను యాంటీ నార్కోటిక్ అధికారులు అరెస్టు చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.దాంతో ఇలాంటి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు తమ స్మగ్లింగ్ కార్యకలాపాలకు భారతీయులను ఎంపిక చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మొత్తానికి బెంగుళూరు నుంచి ఢిల్లీకి హెరాయిన్ ని స్మగుల్ చేస్తూ .. డ్రగ్స్ స్మగ్లర్ గా మారిన ఈ టీచర్.. అధికారులకు పట్టుబడ్డాడు.






First Published:  27 Aug 2022 9:32 AM GMT
Next Story