Telugu Global
National

'ఇండియా' గెలవకపోతే.. భారత్ మొత్తం మణిపూర్ లా మారుతుంది

ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడం, వీటన్నిటినీ కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు స్టాలిన్. భారత్ మొత్తం మణిపూర్, హర్యానాలా కాకుండా ఉండాలంటే 'ఇండియా' కూటమి గెలుపు అనివార్యం అన్నారు స్టాలిన్.

ఇండియా గెలవకపోతే.. భారత్ మొత్తం మణిపూర్ లా మారుతుంది
X

మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణ, హర్యానాలో మత ఘర్షణ.. ఇది శాంపిల్ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ మొత్తం ఇలాగే తగలబడిపోతుందని తీవ్ర విమర్శలు చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. 'ఇండియా' కూటమి గెలవకపోతే జరగబోయేది ఇదేనని జోస్యం చెప్పారు. 'స్పీకింగ్ ఫర్ ఇండియా' అనే పోడ్‌ కాస్ట్ సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు స్టాలిన్. 9 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు స్టాలిన్. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పడం, రైతుల ఆదాయం రెట్టింపవుతుందని అనడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఇంటింటికీ మంచినీరు.. ఇలాంటివేవీ జరగలేదని చెప్పారు స్టాలిన్.

ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడం, వీటన్నిటినీ కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు స్టాలిన్. వైవిధ్య భరితమైన భారత దేశాన్ని, సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రజలు రూపొందించుకోవాలి పిలుపునిచ్చారు. భారత్ మొత్తం మణిపూర్, హర్యానాలా కాకుండా ఉండాలంటే 'ఇండియా' కూటమి గెలుపు అనివార్యం అన్నారు స్టాలిన్.

పెడరలిజానికి ముప్పు వచ్చినప్పుడల్లా డీఎంకే ముందు ఉంటుందని గుర్తు చేశారు స్టాలిన్. అందుకే ఇండియా కూటమితో కలసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి అప్పుడే రియక్షాన్లు మొదలయ్యాయి. స్టాలిన్ ఇప్పటికైనా భారత్ ని దేశంగా ఒప్పుకున్నారని సెటైర్లు పేలుస్తున్నారు బీజేపీ నేతలు.

First Published:  4 Sep 2023 8:28 AM GMT
Next Story