Telugu Global
National

బీజేపీలో మహిళలకు గౌరవం లేదు.. పార్టీకి గాయత్రి రాజీనామా

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వింగ్ ద్వారా తాను ట్రోలింగ్‌ కు గురయ్యాననేది గాయత్రి రఘురామ్ ప్రధాన ఆరోపణ. మహిళలకు బీజేపీలో సమాన హక్కులు లేవని, పార్టీలో గౌరవం లేదని ఆమె ఆరోపించారు.

బీజేపీలో మహిళలకు గౌరవం లేదు.. పార్టీకి గాయత్రి రాజీనామా
X

బీజేపీలో మహిళలకు గౌరవం లేదంటూ సొంత పార్టీ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి పార్టీలో తాను ఉండలేనంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఆమెను గతంలో బీజేపీ సస్పెండ్ చేయడం విశేషం. ఇప్పుడామె పార్టీకి గుడ్ బై చెబుతూ.. పార్టీ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు. తమిళనాడుకి చెందిన బీజేపీ నేత, నటి గాయత్రి రఘురామ్ మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు.

వివాదం ఏంటి..?

తమిళనాడు బీజేపీ నాయకుడు తిరుచ్చి సూర్య గతంలో పార్టీలోని మహిళా మోర్చా నేతతో అసభ్యంగా ఫోన్ లో మాట్లాడాడు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఆ సందర్భంలో గాయత్రి రఘురామ్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకురాలిగా ఉండేవారు. తిరుచ్చి సూర్యపై గాయత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పార్టీ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేసింది. తిరుచ్చి సూర్య కూడా పార్టీకి రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు గాయత్రి కూడా పార్టీని వీడటం గమనార్హం.

టార్గెట్ అన్నామలై..

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వింగ్ ద్వారా తాను ట్రోలింగ్‌ కు గురయ్యాననేది గాయత్రి రఘురామ్ ప్రధాన ఆరోపణ. మహిళలకు బీజేపీలో సమాన హక్కులు లేవని, పార్టీలో గౌరవం లేదని ఆమె ఆరోపించారు. దానికి కారణం అన్నామలై అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందూత్వం అంటే ఇష్టమని, అందుకే బీజేపీలో చేరానని చెప్పిన ఆమె.. బరువెక్కిన హృదయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అన్నామలై నాయకత్వంలో మహిళలు సురక్షితంగా లేరని, తాను ఓ బయటి వ్యక్తిలాగా ట్రోలింగ్ కి గురవుతున్నాను అని ఆమె అన్నారు.

First Published:  3 Jan 2023 7:48 AM GMT
Next Story