Telugu Global
National

బీజేపి నేత చీటింగ్... తన బదులు మరొకరితో డిగ్రీ పరీక్ష రాయించి అడ్డంగా బుక్కయ్యాడు

బీజేపి నేత చీటింగ్... తన బదులు మరొకరితో డిగ్రీ పరీక్ష రాయించి అడ్డంగా బుక్కయ్యాడు
X

ఓ బీజేపీనేత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవాలనుకున్నాడు. కానీ చదువూ రాదు, చదువుకునే ఓపికా లేదు. అయినా సరే తను అసలే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్యమైన‌ నాయకుడు, అందులోనూ ఓ జిల్లా అధ్యక్షుడు. ఇక తనకెదురులేదనుకున్నాడు. తనను ఎవరు ఆపగలర‌నే ధైర్యంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తన బదులు మరో వ్యక్తితో పరీక్ష రాయించి అడ్డంగా బుక్ అయ్యాడు.

తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ ఆ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే తానేమాత్రం రాయగలడో ఆయనకో అంచనా ఉంది అందుకే మరొకరెవరన్నా తన పరీక్ష రాసిపెట్టాలని ఏబీవీపీ నాయకుడు రమేష్ అనే వ్యక్తిని సంప్రదించాడు. ఆ రమేష్ తిరువారూర్‌ సభాపతి మొదలియార్‌ వీధికి చెందిన దినకరన్ అనే వ్యక్తికి ఆ పని అప్పజెప్పాడు. ఇక తిరువారూరు సమీపంలోని గీతారం కొండన్ తిరువారూర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో భాస్కర్ కు బదులు పరీక్ష రాయడానికి దినకరన్ హాజరయ్యాడు.

పరీక్ష హాలులో ప్రొఫెసర్లు, విద్యార్థుల హాల్ టిక్కెట్లు తనిఖీ చేస్తుండగా దినకరన్ మీద అనుమానం వచ్చింది. అతన్ని ప్రశ్నించినా నిజం చెప్పలేదు. దాంతో అధికారులు పోలీసులను పిలిచారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బోరుమంటూ మొత్తం విషయాన్ని క‌క్కేశాడు దినకరన్.

తనను ఈ పరీక్ష రాయమని ఏబీవీపీ నాయకుడు రమేష్ కోరాడని అయితే ఎవరి పరీక్ష తాను రాస్తున్నానో తనకు తెలియదని చెప్పాడు. దాంతో పోలీసులు రమేష్ ను కూడా అరెస్టు చేసి విచారించగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ పేరు బైటపడింది.

ఈ విషయం తెలిసిన భాస్కర్ పరారయ్యాడు. పైగా ''నా పేరుతో బ్యాచిలర్ డిగ్రీ పరీక్ష రాసిన వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు'' అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయినా పోలీసులు భాస్కర్ కోసం గాలింపు ప్రారంభించి.. తిరువారూర్‌ మాదాపురంలోని బీజేపీ నేత వాసన్‌ నాగరాజన్‌ ఇంట్లో తలదాచుకున్న భాస్కర్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

తాము నీతి నిజాయితీలకు మారుపేరుగా ప్రచారం చేసుకునే బీజేపీ నేతలు భాస్కర్ వ్యవహారంలో కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు

First Published:  15 Aug 2022 4:37 AM GMT
Next Story