Telugu Global
National

ద‌ళితుల‌పై దాడుల్లో త‌మిళ‌నాడుదే అగ్ర‌స్థానం!

దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతునే ఉన్నాయి. కేంద్ర హోం మంత్ర‌త్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ దాడుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.

ద‌ళితుల‌పై దాడుల్లో త‌మిళ‌నాడుదే అగ్ర‌స్థానం!
X

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ద‌ళితులు,షెడ్యూల్డ్ తెగ‌ల వారిపై అత్య‌ధికంగా దాడులు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో 38 జిల్లాల‌కు గాను 37 జిల్లాల‌లోనూ ఈ దాడులు జ‌ర‌గుతున్న‌ట్టు కేంద్ర హోం మంత్ర‌త్వ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈ జిల్లాల‌లోని 345 గ్రామాల్లో అణగారిన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలపై నేరాలకు పాల్ప‌డుతున్న‌ట్టు గుర్తించిన‌ట్టు తెలిపింది. రాష్ట్రంలోని ఏడు పోలీసు కమిషనరేట్ల ప‌రిధిలో గ‌ల 27 గ్రామాల‌ను దాడులు జ‌రిగే ప్రాంతాలుగా 2020లోనే గుర్తించిన‌ట్టు తెలిపింది.

లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రిత్వ శాఖ ఈ డేటాను విడుదల చేసింది.

తమిళనాడు వ్యాప్తంగా 2016-2020 మధ్యకాలంలో జరిగిన వివిధ కుల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మొత్తం 300 హత్యలు జ‌రిగాయ‌ని అంత‌కు ముందు ఆర్టీఐ క‌మిష‌న్ వెల్ల‌డించింది. ఈ కేసుల‌న్నీ ఎస్సీ ఎస్టీ ల‌పై అత్యాచారాల నిరోధక సవరణ చట్టం-2015 కింద న‌మోద‌య్య్యాయ‌ని పేర్కొంది. ఈ ఘటనల్లో చాలా మంది బాధితులు దళిత వర్గానికి చెందిన వారే. మదురైకి చెందిన ఒక ఎన్జీవో దాఖ‌లు చేసిన దర‌ఖాస్తుకు జ‌వాబుగా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది.

ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల‌తో పాటు అండమాన్,నికోబార్ దీవుల కేంద్ర పాలిత ప్రాంతాన్నికూడా ద‌ళితుల‌పై దాడుల‌కు అవ‌కాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించామ‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు తర్వాత, తెలంగాణలోని 66 గ్రామాలలో దళితులు, ఎస్టీలు అఘాయిత్యాలకు గురవుతున్నట్టు వెల్ల‌డించింది. వీటిలో నిజామాబాద్ కమిషనరేట్‌లో 18 గ్రామాలు, తరువాత భద్రాద్రి కొత్తగూడెం 17, రామగుండం కమిషనరేట్ 9, నల్గొండ 6, రాచకొండ కమిషనరేట్, మహబూబ్‌నగర్ ఒక్కొక్కటి, ఆదిలాబాద్ 4, నారాయణపేట జగిత్యాల 1 చొప్పున కేసులు ఉన్నాయి.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లో 53 గ్రామాలు 'అట్రాసిటీ ప్రోన్'గా గుర్తించారు. వాటిలో తూర్పుగోదావరి జిల్లా (రాజమండ్రి అర్బన్ జిల్లాతో సహా) అత్యధికంగా 47 గ్రామాలు ఉన్నాయి. కడప జిల్లాలో 5 గ్రామాలు, శ్రీకాకుళంలో ఒక గ్రామం చొప్పున ఉన్నాయి.

కర్ణాటకలోని బెంగళూరు అర్బన్, కలబుర్గి, యాద్గిర్ జిల్లాలు కూడా అట్రాసిటీ పీడిత జిల్లాల జాబితాలో ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా...

దేశవ్యాప్తంగా, తమిళనాడు తర్వాత, బీహార్‌లో 34 జిల్లాలు ఉన్నాయి. ఒడిశాలో 19 జిల్లాలు, రాజస్థాన్‌లో 11, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ రాష్ట్రాల‌లో 11 జిల్లాల చొప్పున‌, జార్ఖండ్ లో 10, చ‌త్తీస్ గ‌ఢ్ లోని రెండు జిల్లాల‌లో 101 గ్రామాలు, మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో రెండు ప్రాంతాలు దాడుల పీడిత (అట్రాసిటీ ప్రోన్‌) ప్రాంతాలుగా ఉన్నాయ‌ని కేంద్ర హోం శాఖ‌ డేటా తెలిపింది.

First Published:  22 July 2022 11:33 AM GMT
Next Story